సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- August 06, 2026
అబుదాబి: పిల్లల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకునే తల్లిదండ్రులకు అబుదాబి కోర్టు కీలక హెచ్చరిక జారీ చేసింది. పిల్లల గోప్యత, భద్రతకు భంగం కలిగించేలా ఆన్‌లైన్‌లో వారి వివరాలను ప్రచారం చేయకూడదని ఆదేశిస్తూ, ఇప్పటికే ఉన్న కంటెంట్‌ను తొలగించాలని విడాకులు తీసుకున్న ఓ దంపతులకు అబుదాబి సివిల్ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. పిల్లల ప్రయోజనాలకు హాని కలిగించే కంటెంట్‌ను తొలగించాలని, పరస్పర అనుమతి లేకుండా పిల్లల పేర్లతో సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభించకూడదని స్పష్టం చేసింది.యూఏఈలోని వదీమా చైల్డ్ రైట్స్ లా ఆధారంగా ఈ తీర్పు వెలువడింది.
తల్లిదండ్రుల మధ్య వివాదాల కంటే పిల్లల గోప్యత, సంక్షేమమే ముఖ్యమని కోర్టు పేర్కొంది.
ఈ తీర్పు గురించి న్యాయ నిపుణులు మాట్లాడుతూ.. యూఏఈ కోర్టు తొలిసారిగా ఇద్దరు తల్లిదండ్రులకూ పిల్లల ఫొటోలు, వీడియోలను ప్రచారం చేయకుండా ఆదేశించడం ఇదే మొదటి కేసు అని తెలిపారు. ఈ తీర్పు తల్లిదండ్రుల మధ్య ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే అంశంపై కాకుండా పిల్లల హక్కుల పరిరక్షణపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. ఈ కేసులో తండ్రి మొదట తన మాజీ భార్య పిల్లల ఫొటోలను డిజిటల్ వేదికలపై, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. అయితే తల్లి కూడా తండ్రి పిల్లలకు సంబంధించిన కంటెంట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారని వాదించారు. దీంతో కోర్టు ఒకరికి అనుకూలంగా కాకుండా, ఇద్దరు తల్లిదండ్రులు పిల్లల గోప్యతను పూర్తిగా కాపాడలేకపోయారని గుర్తించి, ఇద్దరికీ సమాన ఆదేశాలు జారీ చేసింది.
పిల్లల ఫొటోలు, వీడియోల ప్రచురణ వాణిజ్యపరమైనదైనా, సాధారణమైనదైనా వారి ప్రయోజనాలకు నష్టం కలిగిస్తే అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే, బాధిత తల్లిదండ్రులు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని, అప్పుడు జైలు శిక్ష లేదా ఉమ్మడి సంరక్షణ హక్కు (జాయింట్ కస్టడీ) కోల్పోయే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించింది.
పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టే ప్రతి తల్లిదండ్రి ఈ తీర్పును గమనించాలని న్యాయ నిపుణులు సూచించారు. పిల్లలకు సంబంధించిన ఏ కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో పంచుకునే ముందు మరో తల్లిదండ్రి అనుమతి తీసుకోవాలని, పిల్లల పేర్లతో ఖాతాలు ప్రారంభించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పిల్లలు పెద్దయ్యాక కూడా తమ చిన్ననాటి పోస్టులను చూసి ఇబ్బంది పడకుండా, తల్లిదండ్రులు సోషల్ మీడియా వినియోగంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







