JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..

- January 17, 2026 , by Maagulf
JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..

జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) శనివారం విడుదల చేసింది. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను అధికారిక వెబ్‌సైట్ http://jeemain.nta.nic.in లో అందుబాటులో ఉంచినట్లు ఎన్టీఏ తెలిపింది.

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్షలు జనవరి 21, 22, 23, 24 మరియు 28 తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్‌-2 పరీక్ష జనవరి 29న జరుగుతుంది. ప్రస్తుతానికి తొలి నాలుగు రోజులకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులనే విడుదల చేయగా, 28, 29 తేదీల పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు తర్వాత విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది.

ఈ పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. (JEE Main 2026) మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ విధానం:
అభ్యర్థులు http://jeemain.nta.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లి హోమ్‌పేజీలో ఉన్న ‘JEE Main Admit Card 2026 Session-1’ లింక్‌పై క్లిక్‌ చేయాలి.
అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్‌ అవ్వాలి.
అడ్మిట్‌ కార్డు స్క్రీన్‌పై కనిపించిన వెంటనే ప్రింట్‌ తీసుకోవాలి.
కార్డులో పరీక్ష తేదీ, కేంద్రం, షిఫ్టు వంటి వివరాలు సరిగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించాలి.
ఏవైనా సమస్యలు ఉంటే [email protected] కు మెయిల్‌ ద్వారా సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com