దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

- January 19, 2026 , by Maagulf
దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ (స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.

చంద్రబాబు నిన్న అర్ధరాత్రి దావోస్ పర్యటనకు బయల్దేరారు. తొలుత ఆయన జ్యూరిచ్ చేరుకుని, అక్కడ జరిగే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని తెలుగు ప్రజలకు ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో దావోస్‌కు ప్రయాణిస్తారు. దావోస్‌లో ఆయన నాలుగు రోజుల పాటు ఉన్నారు. ఈ కాలంలో 36 కార్యక్రమాల్లో పాల్గొని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడుల అవకాశాలపై దృష్టి పెట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఆయన యూఏఈ ఆర్థిక, పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో సహా వివిధ విభాగాల ప్రతినిధులతో సమావేశమవుతారు. అలాగే టాటాసన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్తో కూడా ముఖాముఖి సమావేశం జరపనున్నారు.

ఈ ఉదయం మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనాన్ని పూర్తి చేసిన అనంతరం, రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు బయల్దేరారు. ఈ పర్యటన ఐదు రోజుల పాటు కొనసాగనుంది. రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయి సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాలపై దృష్టి సారించనున్నారు. తెలంగాణలో మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యాపార అనుకూల వాతావరణాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించేందుకు ఈ పర్యటన ఉపయోగపడతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పర్యటనలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహా పలు ఉన్నతాధికారులు కూడా పాల్గొంటున్నారు. మేడారం అమ్మవార్ల ఆశీస్సులతో ప్రారంభమైన ఈ విదేశీ పర్యటన తెలంగాణకు కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను తెచ్చేలా ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com