పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- January 21, 2026
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు, నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ వ్యవస్థలని, ప్రజాస్వామ్య వ్యవస్థలని కించపరచకూడదని భారత పూర్వ 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది సుమంత్ బత్రా రచించిన "ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ అరుణ్ జైట్లీ" (The Life and Legacy of Arun Jaitley) పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం న్యూఢిల్లీలోని హోటల్ లే మెరిడియన్‌లో ఘనంగా జరిగింది. ఓం బుక్స్ ఇంటర్నేషనల్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి, దివంగత అరుణ్ జైట్లీ రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఎంతో గౌరవప్రదంగా వ్యవహరించే వారని, నేటి రాజకీయాల్లో అటువంటి నేతలు అత్యంత అరుదుగా ఉన్నారని అన్నారు. అరుణ్ జైట్లీని నేతలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
అరుణ్ జైట్లీ అపారమైన జ్ఞానం, రాజకీయ చతురత,మానవీయ విలువల కలయిక అని భారత పూర్వ 13వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు.ఆయన అపర మేధావి, అరుదైన రాజనీతిజ్ఞుడని అన్నారు.బీజేపీ వ్యూహకర్తగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఆయన పోషించిన ప్రతి పాత్రకు గౌరవాన్ని తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు.
జైట్లీ అత్యంత ప్రతిభావంతమైన న్యాయవాది అని, పార్లమెంటులో ఆయన ప్రసంగాలు ఎంతో లోతుగా ఉండేవని చెప్పారు.సంక్లిష్టమైన ఆర్థిక,రాజ్యాంగపరమైన అంశాలను కూడా సామాన్యులకు అర్థమయ్యేలా వివరించడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు.
జైట్లీ తనకు కేవలం రాజకీయ సహచరుడు మాత్రమే కాదని, ఒక ఆత్మీయ మిత్రుడు, మార్గదర్శి అని నాయుడు భావోద్వేగంతో తెలిపారు.1970ల నాటి విద్యార్థి ఉద్యమ కాలం నుండి తామిద్దరం కలిసి ప్రయాణించామని, అత్యవసర పరిస్థితి సమయంలో జైలు శిక్షను కూడా అనుభవించామని గుర్తుచేసుకున్నారు.భారతీయ వంటకాలపై ఉన్న మక్కువ కూడా తమను మరింత దగ్గర చేసిందని ఆయన వెల్లడించారు.
భిన్నమైన రాజకీయ భావజాలాలు కలిగిన పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో జైట్లీ గారు ఒక "వారధి"లా పనిచేశారని, అందుకే అన్ని పార్టీల నేతలు ఆయనను అమితంగా విశ్వసించేవారని చెప్పారు.
రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను ఎప్పుడూ కించపరచకూడదని, జైట్లీ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వ్యవస్థల పట్ల అత్యంత గౌరవంతో ఉండేవారని, నేటి తరం నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.దేశ ఆర్థిక గమనాన్ని మార్చిన జిఎస్టి (GST) దివాలా స్మృతి (IBC) వంటి చారిత్రాత్మక సంస్కరణలు జైట్లీ మేధస్సు, కార్యదక్షత వల్లే సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు.
సుమంత్ బత్రా ఈ పుస్తకంలో జైట్లీ జీవిత ప్రయాణాన్ని,ఆయనలోని మానవీయ కోణాన్ని , ఆయన వ్యక్తిగత జీవితంలోని ఆత్మీయతను అత్యంత వాస్తవికంగా పాఠకులకు అందించారని వెంకయ్య నాయుడు అభినందించారు.ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.సిక్రీ, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఎ.ఎం.సింఘ్వి, పుస్తక రచయిత సుమంత్ బత్రా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







