H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!

- January 25, 2026 , by Maagulf
H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!

అమెరికా: అమెరికాలో పనిచేస్తున్న భారతీయ H-1B వీసాదారులకు ఊహించని షాక్ తగిలింది. వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన వేలాది మంది నిపుణులు ఇక్కడే చిక్కుకుపోయారు. వారి వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లు ఏకంగా 2027 సంవత్సరానికి వాయిదా పడటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా కొద్ది రోజుల్లో ముగిసే ఈ ప్రక్రియ, ఇప్పుడు ఏడాదికి పైగా ఆలస్యం కావడంతో వారి ఉద్యోగాలు, కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

2025 డిసెంబర్ మధ్య నుంచి యూఎస్ కాన్సులేట్లు కొత్త భద్రతా నిబంధనలను అమలు చేయడమే ఈ జాప్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల ఒక్కో దరఖాస్తుకు అదనంగా 20-30 నిమిషాల సమయం పడుతుండటంతో, రోజువారీగా నిర్వహించే ఇంటర్వ్యూల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిన వారికి కూడా తాజాగా 2027 ఏప్రిల్, మే నెలలకు తేదీలను మారుస్తున్నట్లు ఈ-మెయిల్స్ వస్తున్నాయి. దీంతో వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన ఉద్యోగులు అమెరికాలోని తమ కుటుంబాలకు, పిల్లలకు దూరమయ్యారు. అక్కడ ఇళ్ల అద్దెలు, ఇతర బిల్లులు చెల్లిస్తూనే ఇక్కడ చిక్కుకుపోవడంతో తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

ఈ సంక్షోభం దృష్ట్యా, అమెరికాలో ఉన్న H-1B ఉద్యోగులు అత్యవసరం అయితే తప్ప వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు ప్రయాణించవద్దని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి 2027 వరకు కొత్తగా సాధారణ ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో లేకపోవడంతో, వేలాది మంది భారతీయ నిపుణుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com