సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- January 25, 2026
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో నివసిస్తున్న తెలుగు ప్రవాసులు సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య (SATS) ఆధ్వర్యంలో తెలుగు వారికి అతిపెద్ద పండగైన సంక్రాంతి సంబరాలను కనుమ పండుగనాడు 16 జనవరి 2026న అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లో నివసించే దాదాపు వెయ్యి మంది తెలుగు వారు కుటుంబ సమేతంగా హాజరై, సాంప్రదాయ దుస్తుల్లో తమ ఇంటి పండుగలా ఈ వేడుకలను నిర్వహించారు.
‘తెలుగింటి సంక్రాంతి’ను తలపించేలా వేదిక ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో అలంకరించారు. భోగి మంటలు, పొంగలి సువాసనలు, మహిళల కోలాటాలు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. SATS బృందం పురుషులకు కండువాలు, మహిళలకు పసుపు–కుంకుమ జాకెట్ ముక్కలు, గాజులతో కూడిన చిన్న కానుకలు అందించి ప్రత్యేకంగా ఆహ్వానించింది.
ఈ కార్యక్రమాన్ని SATS అధ్యక్షులు కోనేరు ఉమా మహేశ్వర రావు దంపతులు దీప ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం SATS ప్రతినిధి బృందం సభ్యులు శర్మ చివుకుల దంపతులు, విజయకుమార్ దంపతులు, నాగ శేఖర్, అనిత, కందిబేడల వరప్రసాద్ దంపతులు, పాపారావు, దిలీప్, రోహిత్ నంద, అద్దంకి కిషోర్, శ్రీనివాస్ గుబ్బాల, మనోహర్ ప్రసాద్, ఎన్‌వీబీ కిషోర్, ప్రవీణ్ కోలేటి, కేవీఎన్ రాజు, గౌరు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్ర గీతాలను బాలికలు ఆలపించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి SATS అధ్యక్షులు కోనేరు ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ, SATS ఒక విలువలతో కూడిన సంస్థగా తెలుగు భాషాభివృద్ధి, సంస్కృతి, సాహిత్యం, సంప్రదాయాలను విదేశీ గడ్డ పై కాపాడుతూ, ఇతర తెలుగు సంస్థలతో సమన్వయంతో ముందుకు సాగుతోందన్నారు. అలాగే ఆపదలో ఉన్న తెలుగు వారికి సహాయహస్తం అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా సౌదీలోని వివిధ తెలుగు సంస్థల ద్వారా సమాజ సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి ‘సంఘసేవా పురస్కారాలు’ అందించారు. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేసిన ప్రవాస భారతీయ ప్రముఖులు అనిల్ కుమార్ కడీంచర్ల, డా.శ్రీనివాస్, సాయి కృష్ణలకు కూడా ప్రత్యేక పురస్కారాలు ప్రదానం చేశారు.
తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా పిల్లలు, పెద్దలు నిర్వహించిన ఆటపాటలు, సంగీతం, నృత్యాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు చిత్రలేఖనం, మట్టితో బొమ్మలు తయారు చేసే పోటీలు నిర్వహించారు. అదేవిధంగా మ్యూజికల్ చైర్స్, త్రోబాల్, వాలీబాల్, క్రికెట్, షాట్‌పుట్, టగ్ ఆఫ్ వార్ వంటి అనేక క్రీడా పోటీలు నిర్వహించారు.
SATS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రుచికరమైన సంప్రదాయ మధ్యాహ్న భోజనం హాజరైన తెలుగు వారందరికీ ‘తెలుగింటి పండుగ’ను గుర్తుకు తెచ్చింది. తెలుగు టోస్ట్‌మాస్టర్స్ సౌజన్యంతో నిర్వహించిన ‘భువన విజయ సభ’ కార్యక్రమంలో పద్యాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
చిన్నారులకు భోగి పళ్లు పోయడం, బాలులకు సోగ్గాడు, బాలికలకు కుందనపు బొమ్మ వంటి కార్యక్రమాలు నిర్వహించగా, మహిళలకు ర్యాంప్ వాక్, భువన విజయం వంటి వినూత్న కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేసి, కార్యవర్గ సభ్యులను అభినందించారు. జనగణ ఆలాపనతో పాటు జాతీయగీతంతో ఈ కార్యక్రమానికి ముగింపు పలికారు.
ఈ వేడుకలు నిజంగా ‘తెలుగింటి సంక్రాంతిని సౌదీ అరేబియాకు తీసుకొచ్చాయి’ అని హాజరైన వారందరూ అభిప్రాయపడ్డారు.









తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







