ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక

- February 02, 2026 , by Maagulf
ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక: బంగారంపై ‘విలువ పరిమితి’ రద్దు..కొత్త రూల్స్ ఇవే!
 
దుబాయ్: యూఏఈలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులకు (NRIs) కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఫిబ్రవరి 1, 2026న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 'యూనియన్ బడ్జెట్ 2026'లో కస్టమ్స్ బ్యాగేజీ నిబంధనలను భారీగా సవరించారు. దీనివల్ల విమానాశ్రయాల్లో బంగారం విషయంలో ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులు తొలగనున్నాయి.
 
బంగారం నిబంధనల్లో కీలక మార్పులు:
వాల్యూ క్యాప్ రద్దు: గతంలో బంగారం బరువుతో పాటు దాని ధరపై కూడా పరిమితి (మహిళలకు లక్ష, పురుషులకు 50 వేలు) ఉండేది. ఇప్పుడు ఆ ధర పరిమితిని పూర్తిగా ఎత్తేశారు. కేవలం బరువును మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటారు.
మహిళా ప్రయాణికులు: విదేశాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం నివసించిన మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను ఉచితంగా (Duty-free) తీసుకెళ్లవచ్చు. దీని విలువ ఎంత ఉన్నా పన్ను పడదు.
పురుష ప్రయాణికులు: పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకెళ్లవచ్చు.
అమలు: ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 2, 2026 నుండి అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అమలులోకి వచ్చాయి.
 
ఇతర వస్తువులపై వెసులుబాటు:
బంగారంతో పాటు విదేశాల నుంచి తెచ్చే ఇతర వస్తువుల (Gifts/Electronics) డ్యూటీ ఫ్రీ పరిమితిని కూడా ₹50,000 నుండి ₹75,000కి పెంచారు.
వ్యక్తిగత అవసరాల కోసం తెచ్చుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 20% నుండి 10% కి తగ్గించారు.
 
ప్రవాసులకు ఎందుకు లాభం?
గత కొన్ని ఏళ్లుగా బంగారం ధరలు భారీగా పెరగడంతో, 40 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల పరిమితిని ఎప్పుడో దాటేసింది. దీనివల్ల నిబంధనల ప్రకారం బరువు తక్కువ ఉన్నప్పటికీ, విలువ ఎక్కువగా ఉందనే కారణంతో ఎయిర్పోర్టులలో కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు ఆ 'ధర పరిమితి' పోవడంతో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించింది.
 
గమనిక:
ఈ సడలింపు కేవలం ఆభరణాలకు (Jewellery) మాత్రమే వర్తిస్తుంది. బంగారు బిస్కెట్లు, కాయిన్స్ లేదా బార్స్ తీసుకొస్తే కచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
                                                                                                                                           భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యూఏఈ నుండి ఇండియాకు వెళ్లే ప్రయాణికులకు ముఖ్యంగా మహిళలకు గొప్ప ప్రయోజనం కలగనుంది
 
--బాజీ షేక్(యూఏఈ)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com