తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..
- February 27, 2026
తిరుమల: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అనేక మార్పులు దిశగా కసరత్తు చేస్తోంది.ఈ క్రమంలో ముడుపు పత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించింది.తిరుమల శ్రీవారిని ప్రతీరోజూ వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటారు. స్వామివారి దర్శనం అనంతరం మొక్కులు చెల్లించుకుంటారు. వెంకన్నకు హుండీల ద్వారా కానుకలను సమర్పించుకుంటారు. కొందరు మొక్కు రూపంలో స్వామివారికి చిల్లర నాణేలు శ్రీవారి హుండీలలో వేస్తుంటారు. అయితే, ఇకపై నాణేలు బదులు సరికొత్తగా ముడుపు పత్రాల విధానం తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది.
శ్రీవారిని ప్రతీయేటా దాదాపు 2.5కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. స్వామి దర్శనం అనంతరం భక్తులు హుండీలో కానుకలు సమర్పించడమనే సంప్రదాయం వందల ఏళ్ల నుంచి కొనసాగుతోంది. టీటీడీ బడ్జెట్‌లోనే ప్రధాన ఆదాయ వనరు కూడా హుండీనే. 2025లో హుండీ ఆదాయం రూ.1,383 కోట్లు వచ్చింది. అయితే, ఇప్పటి వరకు భక్తులు మొక్కు రూపంలో శ్రీవారి హుండీలో చిల్లర నాణేలు వేస్తున్నారు.
ఇకపై నాణేలకు బదులు ముడుపుపత్రాల రూపంలో వేసేందుకు వీలుగా తిరుపతితోపాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ముడుపు పత్రం కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భక్తులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, నెఫ్ట్ ద్వారా నగదును పంపితే అందుకు తగిన ముడుపు పత్రాలు అందిస్తారు. వాటిని నేరుగా హుండీలో వేయొచ్చు. దీంతో భక్తులకు భారీగా నాణేలను, నగదును తీసుకెళ్లడంలో ఉన్న ఇబ్బందులు తొలగుతాయి.
చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. ఇందులో ముడుపు పత్రాలు అందుబాటులోకి తీసుకొచ్చే నిర్ణయానికి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజూ లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తుండగా.. ఈ యజ్ఞంలో దాతలు పెద్ద ఎత్తున పాలుపంచుకుంటున్నారు.
ప్రస్తుతం ఒక్కరోజు మొత్తం అన్నప్రసాద వితరణ, ఉదయం అల్పాహారం, రాత్రి భోజనానికి లక్షల్లో విరాళం ఉంటుంది. ఈ క్రమంలో సామాన్య భక్తులు అంతమొత్తంలో విరాళం ఇవ్వలేని పరిస్థితి. పెద్దమొత్తంలో విరాళం ఇవ్వలేని సామాన్య భక్తుల కోసం పదిమంది, వంద మంది భక్తులకు సరిపడా విరాళం ఇచ్చినా వారిపేరున అన్నదానం చేస్తారు. ఈ విధానాన్ని తొందరలోనే అందుబాటులోకి తీసుకురావడంపై ఇవాళ జరిగే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







