మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ

- September 22, 2026 , by Maagulf
మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ

మారిషస్: ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకులు డా.గజల్ శ్రీనివాస్ రూపొందించిన “శ్రీమద్భగవద్గీత – ఆంగ్ల ఆడియో ఆల్బమ్”ను మారిషస్ రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకుల్ దంపతులు ఘనంగా లోకార్పణం చేశారు. మారిషస్‌లోని శ్రీ హరిహర దేవస్థానం–కళాజ్యోతి ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ ప్రత్యేక ఆడియో ఆల్బమ్‌లో శ్రీమద్భగవద్గీతలోని 700 శ్లోకాలను డా. గజల్ శ్రీనివాస్ స్వరపరచి స్వయంగా గానం చేశారు. కోల్‌కతాలోని అద్వైత ఆశ్రమానికి చెందిన శ్రీ స్వామి స్వరూపానంద అందించిన ఆంగ్ల అనువాదాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఆల్బమ్‌ను రూపొందించారు. గీతా తాత్పర్యాలకు ఎన్.పార్థసారథి ఆంగ్లంలో స్వరాన్ని అందించారు.

ఈ సందర్భంగా మారిషస్ రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకుల్ మాట్లాడుతూ, డా.గజల్ శ్రీనివాస్ రూపొందించిన శ్రీ మద్భగవద్గీత ఆంగ్ల ఆడియో ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. “శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి శాశ్వత జీవన గ్రంథం” అని ఆయన అభివర్ణించారు.

శ్రీమద్భగవద్గీతను ప్రపంచంలోని 100 భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో డా. గజల్ శ్రీనివాస్ చేపట్టిన గ్లోబల్ గీతా ఉద్యమాన్ని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. భారతీయ ఆధ్యాత్మిక సంపదను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేసేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమాన్ని బృందావన పార్థసారథి సమన్వయం చేసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మారిషస్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి అజయ్ గున్నెస్, ఆర్థిక శాఖ మంత్రి జ్యోతి జీతన్, దేశ ప్రధాన కార్యదర్శి సురేష్ సీబాలక్ తదితర ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మారిషస్ రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకుల్ అతిథులకు శ్రీమద్భగవద్గీత ఆడియో పెన్‌డ్రైవ్‌లను అందజేశారు.

భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపదను తన గానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో డా.గజల్ శ్రీనివాస్ చేపట్టిన గ్లోబల్ గీతా మిషన్‌లో ఆంగ్ల శ్రీమద్భగవద్గీత ఆడియో ఆల్బమ్ లోకార్పణం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com