క్రీడాకారులు గా నటించాలని కథానాయకులు

- July 31, 2016 , by Maagulf
క్రీడాకారులు గా నటించాలని కథానాయకులు

క్రీడా నేపథ్యంలో సాగే చిత్రాలకు బాలీవుడ్‌లో బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మధ్య విడుదలైన 'సుల్తాన్‌' అక్కడ ప్రభంజనం సృష్టిస్తోంది. అజారుద్దీన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'అజహర్‌'కు భారీ ప్రచారం లభించింది. 'సాలా ఖడూస్‌' గురించి కూడా ఆసక్తికరంగా చర్చించుకొన్నారు. ఆమీర్‌ఖాన్‌ 'దంగల్‌' కూడా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అప్పుడే విశ్లేషకులు లెక్కలు కట్టేస్తున్నారు. అందుకే క్రీడా కథలపై మన కథానాయకులూ ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. వెంకటేష్‌, నాగచైతన్య, సుధీర్‌బాబు ఇప్పుడు అలాంటి కథల్లోనే నటిస్తున్నారు. రానా, అఖిల్‌లాంటి కథానాయకులు ఈ తరహా కథలపై దృష్టి పెడుతున్నారు. తె లుగులో క్రీడానేపథ్యం ఉన్న సినిమాలు తక్కువగానే వచ్చాయి. 'కబడ్డీ' సీజన్‌ ఒకప్పుడు బాగానే సాగింది. 'ఒక్కడు'లో మహేష్‌బాబు కూత పెట్టినవాడే. 'కబడ్డీ కబడ్డీ', 'భీమిలి కబడ్డీ జట్టు' ఈ తరహా కథలే. 'సై'లో రగ్బీకి కమర్షియల్‌ టచ్‌ ఇచ్చారు రాజమౌళి. 'వసంతం'లో వెంకటేష్‌ క్రికెటర్‌గా కనిపించారు. 'తమ్ముడు'లో పవన్‌ కల్యాణ్‌, 'అమ్మ ఓ నాన్న తమిళ అమ్మాయి'లో రవితేజ బాక్సర్లుగా మెరిశారు. ఇటీవల 'తుంటరి'లో నారా రోహిత్‌ చేతికి గ్లౌజులొచ్చాయి. 'గోల్కొండ హైస్కూల్‌', 'సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు' క్రికెట్‌ నేపథ్యంలో సాగాయి. ఇప్పుడు మళ్లీ ఆ హవా వీస్తోంది. ఆ తరహా కథలు రాసుకోవడానికి రచయితలు, తెరకెక్కించడానికి దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు.బాలీవుడ్‌ చిత్రం 'సాలా ఖడూస్‌'ని తెలుగులో వెంకటేష్‌తో రీమేక్‌ చేస్తున్నారు. బాక్సింగ్‌ కోచ్‌గా వెంకీ కనిపించబోతున్నారు. సుధ కె.ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. పుల్లెల గోపీచంద్‌ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో కథానాయకుడిగా సుధీర్‌బాబు కనిపిస్తారు. సుధీర్‌ స్వతహాగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడే. కాబట్టి ఆ పాత్రలో సహజంగా ఇమిడిపోతాడన్నది దర్శక నిర్మాతల ఉద్దేశం. తమిళ దర్శకుడు రవి అరసు కథకు నాగచైతన్య ఓకే చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది 'ఎట్టి' అనే తమిళ చిత్రానికి రీమేక్‌ అని తెలుస్తోంది. ఇది పరుగు పందాలు నేపథ్యంలో సాగే కథ. సుల్తాన్‌' చూశాక ఆ తరహా కథా చిత్రాల్లో నటించాలని రానాకి అనిపిస్తోందట. అందుకోసం ఆయన కొన్ని కథలు వింటున్నారని తెలుస్తోంది. ప్రో కబడ్డీకి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు రానా. కబడ్డీ నేపథ్యంలో కథలొస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ఇదివరకే ప్రకటించారు. అల్లు అర్జున్‌ కూడా ఇదే మాట చాలా సందర్భాల్లో చెప్పారు. అఖిల్‌కు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఆ నేపథ్యంలో అఖిల్‌ ఓ చిత్రంలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
 భారతీయులందరినీ ఒకేతాటిపై తీసుకొచ్చే అంశాల్లో క్రీడలకూ స్థానం ఉంది. క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతోందంటే ఆఫీసులకు డుమ్మాకొట్టి టీవీలకు అతుక్కుపోతుంటారు. క్రీడలకు ఉన్న శక్తి అది. దాన్ని తెరపై సమర్థవంతంగా చూపిస్తే తప్పకుండా ఆదరిస్తారన్న భరోసా దర్శక నిర్మాతలకు కలుగుతోంది. అందుకే ఈ తరహా చిత్రాలు వరుస కడుతున్నాయి. ఇందులో కనీసం ఓ చిత్రమైనా బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తే మిగిలిన కథానాయకులూ ఆ దిశగా ఆలోచించే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com