మావయ్యల ఆశీర్వాదంతోనే ఇక్కడివరకు రాగలిగా:సాయిధరమ్ తేజ్
- July 31, 2016
'తిక్క' పాటల వేడుకలో సాయిధరమ్ తేజ్ సా యిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'తిక్క'. లారిస్సా బోనేసి, మన్నారా చోప్రా కథానాయికలు. సునీల్‌రెడ్డి దర్శకుడు. సి.రోహిణ్‌కుమార్ రెడ్డి నిర్మాత. ఎస్.ఎస్.తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలోని గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని దర్శకుడు వంశీ పైడిపల్లి ఆవిష్కరించారు. కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ''మావయ్యలు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లకి జీవితాంతం రుణపడి ఉంటా. వారి ఆశీర్వాదంతోనే ఇక్కడివరకు రాగలిగా. దర్శకుడు సునీల్‌రెడ్డితో ఎప్పటినుంచో నాకు పరిచయముంది. నిర్మాత నన్నొక సోదరుడిలా భావించి ప్రోత్సహించారు. ఎక్కడా ఏ విషయంలోనూ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. తమన్ హుషారైన స్వరాల్ని సమకూర్చారు. గుహన్ ఛాయాగ్రహణం సినిమాకి అదనపు బలం. అలీ, రఘుబాబు తదితర సీనియర్ నటులతో కలిసి నటించడం మంచి అనుభవం'' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఇంతకుముందు నేను పరాజయాల్ని చవిచూశా. అయినా నన్ను నమ్మి అవకాశమిచ్చారు సాయిధరమ్ తేజ్, రోహిణ్. తమన్ బాణీలు వినసొంపుగా ఉన్నాయ''న్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ''ఈ చిత్ర దర్శకుడు నాకు మంచి మిత్రుడు. తను తీసిన ఈ 'తిక్క'కి ఓ లెక్క ఉంటుందనుకొంటున్నా. సినిమాపై ప్రేమతో నిర్మాత ఈ చిత్రాన్ని తీశాడు. తమన్ సంగీతం బాగుంది. సాయిధరమ్ తేజ్ విజయవంతమైన కథానాయకుడయ్యాడు. భయంతో కెరీర్‌ని ఆరంభించాడు. విజయాలొస్తున్నా తనలో ఆ భయం పోలేదు. అదలాగే ఉంటే ఇంకా ఎదుగుతాడు. తనతో సినిమా చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాన''న్నారు. తమన్ మాట్లాడుతూ ''సునీల్‌రెడ్డితో పనిచేయడం బాగుంది. సాయిధరమ్ తేజ్, నేను క్రికెట్ ప్రేమికులం. ఆ ఆటతోనే స్నేహితులమయ్యాం. తేజులో మంచి హుషారు ఉంది. ఈ సినిమా కోసం నేను ఏడాది కాలంగా పనిచేస్తున్నా. ఈ చిత్రం కోసం పాటలు పాడిన ధనుష్, శింబుకు కృతజ్ఞతలు. శ్రోతల స్పందన గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా'' అన్నారు. కె.జానారెడ్డి మాట్లాడుతూ ''ఈ చిత్రం కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక బృందానికి నా అభినందనలు. తిక్క అనే మాటకి చాలా అర్థాలొస్తాయి. ఎక్కువ ఇష్టమో లేదంటే ఏదైనా ఓ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం గురించే ఇక్కడ ఆ పేరుని నిర్ణయించారనుకొంటున్నా. ఈ చిత్రం విజయవంతమై, చిత్ర నిర్మాత భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆకాంక్షిస్తున్నా'' అన్నారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాగంటి గోపీనాథ్, అంజన్ కుమార్ యాదవ్, కె.ఎస్.రామారావు, ఎ.యస్.రవికుమార్ చౌదరి, కోన వెంకట్, దిల్‌రాజు, నందినిరెడ్డి, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







