ఆగస్టు అంతా పెళ్లి సందడే..

- July 31, 2016 , by Maagulf
ఆగస్టు అంతా పెళ్లి సందడే..

మదనపల్లె సిటీః మూడు నెలల మూఢం తర్వాత జిల్లాకి ఒక్కసారిగా పెళ్లి కళ వచ్చేసింది. ఈ సీజన్‌లో ఆగస్టులో మాత్రమే ముహుర్తాలు ఉండడంతో పెళ్లిళ్ల హడావుడి ఊపందుకుంది. ఇప్పటికే కల్యాణ మండపాలన్నీ బుక్‌ అయిపోగా ఫొటోగ్రాఫర్లు, క్యాటరింగ్, డెకరేషన్, బ్యూటీపార్లర్లు, ట్రావెల్స్, మంగళవాయిద్యాలు వారికి గిరాకీ పెరిగింది. మొత్తం ఈ సీజన్‌లో ప్రధానంగా జిల్లాలోని పుణ్యక్షేత్రాలైన తిరుమల, తిరుపతి, కాణిపాకంతో పాటు చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పీలేరు, పుత్తూరుతో పాటు చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో సైతం నాలుగైదువేల జంటలకు వివాహాలు జరగనున్నాయి. ఈ ఏడాది పెళ్లిళ్ల ముహుర్తాలు చాలా తక్కువ. ఏప్రిల్‌ తర్వాత వరుసగా మూఢం, అనంతరం ఆషాఢమాసం రావడంతో కల్యాణ మండపాలు కళతప్పాయి. మూడు నెలల తర్వాత మళ్లీ ముహుర్తాలు మొదలు కావడంతో పెళ్లిళ్లకు సంబంధించిన అనుబంధ వ్యాపారాలు ఊపందుకున్నాయి. మంగళవాయిద్యాల నుంచి పురోహితుల వరకు అందరికీS డిమాండ్‌ ఏర్పడింది. ప్రధానంగా ఆగస్టు 6,7,13,18,20,21,25,26,27 తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. సంబంధాలు కుదుర్చుకున్న వారంతా ఆగస్టులోనే పెళ్లిళ్లు చేసేందుకు హడావుడిగా ముందుకు సాగుతున్నారు.వ్యాపారాలకు ఊపుజిల్లాలో సుమారు 1200కుపైగా కల్యాణ మండపాలున్నాయి. ఆగస్టులో పరిమితంగా ఉన్న ముహుర్తాలకు ప్రతి కల్యాణమండపం ఇప్పటికే బుక్‌ అయిపోయాయి. మండపాల అద్దెలు లక్షల్లో పలుకుతున్నాయి. సీజన్‌ కావడంతో ప్రతి పనికీ డబుల్‌ రేట్లు చెల్లించాల్సి వస్తుందని వధూవరుల తల్లిదండ్రులు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్లకు వాహనాల ఏర్పాటు, అతిథుల కోసం లాడ్జిలు, హోటళ్లు బుక్‌ చేయడంలో బిబీ అయిపోయారు. ఇదిలా ఉంటే మ్యారేజ్‌ స్టేటస్‌ సింబల్‌గా భావించే వారికి పెళ్లి సినిమా షూటింగ్‌ను తలపిస్తోంది. కల్యాణ మండపాన్ని, రిసెప్షన్‌ ప్రాంగణాన్ని భారీ సెట్టింగ్‌లతో తీర్చిదిద్దేందుకు లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి లైవ్‌ ప్రోగామ్‌లుగా చేసేందుకు ఇష్టపడుతున్నారు వివాహ విందులో రుచుల కంటే ఐటెమ్స్‌ సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బఫే డిన్నర్‌లో ఒకొక్క మెనూకు రూ.1000 నుంచి రూ.1500 వరకు ఖర్చు పెట్టేందుకు వెనుకాడడం లేదు. మరోవైపు బెంగుళూరు, చెన్నై నుంచి తాజాపూలను తెప్పించి ప్లవర్‌ డెకరేషన్‌తో మండపాలను అబ్బురపరిచేలా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమైంది. వస్త్రాల విషయంలో పట్టుచీరల అమ్మకాలు ఊపందుకున్నాయి. జిల్లాలోని మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె పట్టుచీరలు అమ్మకాలకు డిమాండ్‌ ఏర్పడింది. దాదాపు 300 రకాల చీరలు అమ్మకాలకు పెట్టారు.
ముహుర్తాల కొన్నే..
ఈ ఏడాది ఆగస్టు నెల శ్రావణంలో మాత్రమే ముహుర్తాలు ఉన్నాయి. అత్యధికంగా ఆగస్టు 18వ తేదీన పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. తర్వాత వచ్చే భాద్రపదంలో శుభకార్యాలు జరగవు. అక్టోబర్‌ 10 వరకు గురుమూఢం వస్తోంది. కాబట్టి ముహుర్తాలు ఉండవు. అశ్వయిజ మాసంలో కూడా దసరా తర్వాతే ముహుర్తాలు ఉన్నాయి.
- సాయి చక్రవర్తి, పురోహితులు, మదనపల్లె

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com