ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- March 25, 2026
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను నిలిపివేసే ప్రయత్నంలో భాగంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇరాన్‌కు 15 సూత్రాలతో కూడిన వివరణాత్మక కాల్పుల విరమణ ప్రతిపాదనను పంపినట్లు తెలుస్తోంది. పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రణాళికను పాకిస్థాన్‌కు చెందిన మధ్యవర్తుల ద్వారా అందించారని తెలుస్తోంది. వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య కొత్త చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు కూడా పాకిస్థాన్ ముందుకొచ్చింది. పశ్చిమాసియా ప్రాంతాల్లో ఇప్పటికే మోహరించిన సుమారు 50వేల మంది సిబ్బందికి తోడు మరో వెయ్యి మంది సైనికులను పంపేందుకు యూఎస్ సైన్యం సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ దౌత్యపరమైన చర్య చోటుచేసుకుంది.
కాల్పుల విరమణ ప్రతిపాదనలతో పాటు 2 మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్లను కూడా పశ్చిమాసియాకు పంపుతోంది అమెరికా. ఇవి సుమారు 5వేల మంది మెరైన్లు సహా వేల మంది సైనికులను తీసుకువస్తాయి. మరోవైపు.. ఇరాన్‌పై తమ సైనిక ఒత్తిడిని కొనసాగించాలని అమెరికాను పట్టుబడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా చర్యలు తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ రీతిలో వాషింగ్టన్ కాల్పుల విరమణ ప్రణాళికను ముందుకు తెస్తుందని ఇజ్రాయెల్ ఊహించలేదని మీడియా కథనాలు నివేదిస్తున్నాయి.
కీలక షరతులివే..
యుద్ధాన్ని ముగించేందుకు కఠినమైన షరతులను విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అందులో యురేనియం శుద్ధిని నిలిపివేయడం, హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడం సహా అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా కీలక చర్యలున్నాయి.
- ఇరాన్ తన ప్రస్తుత అణు సామర్థ్యాలను విచ్ఛిన్నం చేయడం.
- ఇరాన్ ఇకపై ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వడం.
- ఇరాన్ భూభాగంలో యురేనియం సుసంపన్నం చేయడానికి అనుమతించకపోవడం.
- సుమారు 450 కిలోల యురేనియం నిల్వలో 60 శాతాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అప్పగించడం.
- నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలోని అణు కేంద్రాలను కూల్చివేయడం.
- ఇరాన్ వ్యాప్తంగా ఐఏఈఏకు పూర్తి పారదర్శకత కల్పించడం.
- ఇరాన్ తన ప్రాంతీయ మధ్యవర్తిత్వ కార్యకలాపాలను నిలిపివేయడం.
- మిత్రపక్ష మిలీషియాలకు మద్దతును నిలిపివేయడం.
- హోర్ముజ్ జలసంధిని ప్రపంచవ్యాప్త రవాణాకు తెరిచి ఉంచడం.
- ఇరాన్ క్షిపణి పరిధిని, పరిమాణాలను పరిమితం చేయడం.
- భవిష్యత్తులో క్షిపణి వినియోగం కచ్చితంగా ఆత్మరక్షణకు మాత్రమే వినియోగించడం.
పైన పేర్కొన్న పలు కీలక ప్రతిపాదనలతో కూడిన కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్‌కు అమెరికా పంపినట్టు సమాచారం..
తాజా వార్తలు
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్‌లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్‌కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్‌కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ









