ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం

- March 28, 2026 , by Maagulf
ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం

అమరావతి: కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం జొన్నగిరి వేదికగా భారీ ఎత్తున బంగారు గనుల తవ్వకం ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తరహాలో, భారతదేశపు తదుపరి అతిపెద్ద బంగారు గనిగా అవతరించబోతోంది. జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నేతృత్వంలో సాగుతున్న ఈ ప్రాజెక్టు, అత్యాధునిక సాంకేతికతతో దేశీయంగా బంగారు ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం వేగంగా ఇస్తున్న అనుమతులు , పారదర్శకమైన విధానాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని నింపుతున్నాయి. దశాబ్దాలుగా నత్తనడకన సాగిన ఈ గనుల తవ్వకం అంశంపై, ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మౌలిక సదుపాయాల కల్పన , అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇది కేవలం ఒక మైనింగ్ ప్రాజెక్టు మాత్రమే కాకుండా .. జాతీయ ప్రాధాన్యమున్న ప్రాజెక్టుగా గుర్తిస్తున్నారు.

జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు ద్వారా ఏటా సుమారు 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరనుంది. అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంతం పారిశ్రామిక హబ్‌గా మారే అవకాశం ఉంది. ఈ గోల్డ్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో పెంచుతోంది. గనుల తవ్వకంలో పర్యావరణ నియమాలను పాటిస్తూనే, పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయడం ద్వారా రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. దేశ అవసరాలకు తగ్గట్టుగా బంగారు దిగుమతులను తగ్గించి, స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడంలో జొన్నగిరి కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com