రాత్రిపూట హెడ్‌లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!

- April 19, 2026 , by Maagulf
రాత్రిపూట హెడ్‌లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!

దోహా: రాత్రిపూట వాహన లైట్లు ఆన్ చేయకుండా వాహనం నడిపే వారు, ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 70ని ఉల్లంఘిస్తున్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) వాహనదారులను హెచ్చరించింది. రాత్రిపూట ఏ ప్రయాణం ప్రారంభించే ముందు అయినా, వాహన లైట్లు పనిచేస్తున్నాయని  వాహనదారులు తప్పక నిర్ధారించుకోవాలని మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.  

సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ఉన్న సమయంలోలేదా పగటి వేళల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా విజిబిలిటీ (visibility) తక్కువగా ఉన్నప్పుడు, వాహన లైట్లను ఉపయోగించకుండా రహదారిపై వాహనం నడపపడానికి అనుమతి లేదని ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 70 పేర్కొంటుందని గుర్తుచేశారు.

వాహనదారులు 'డిప్డ్ బీమ్' (తక్కువ కాంతి) హెడ్‌లైట్లు, వెనుక వైపు ఉండే రెండు లైట్లు మరియు వెనుక నంబర్ ప్లేట్ లైట్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి. అలాగే, వాహనాన్ని పార్క్ చేసినప్పుడు 'ఫుల్ బీమ్' (అధిక కాంతి) హెడ్‌లైట్‌ను ఆన్ చేయకూడదు. ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లు మిరుమిట్లు గొలపకుండా నివారించడానికి, తగినంత దూరంలో మరొక వాహనం ఎదురైనప్పుడు, ఫుల్ బీమ్ హెడ్‌లైట్‌ను డిప్డ్ బీమ్ హెడ్‌లైట్‌కు లేదా సైడ్ లైట్లకు మార్చాలి.
అలాగే, వాహనం ముందు భాగంలో ఎటువంటి ఎరుపు రంగు లైట్లు కనిపించకూడదని చట్టం పేర్కొంటుంది. సాధారణ సందర్భాల్లో కేవలం తెలుపు రంగు లైటు, పొగమంచు ఉన్న సందర్భాల్లో పసుపు రంగు లైటు మాత్రమే ఉండాలి.
మోటార్‌సైకిళ్లు మరియు సైకిళ్ల విషయానికి వస్తే, వాహనదారులు మోటార్‌సైకిళ్ల ముందు భాగంలో హెడ్‌లైట్లు, వెనుక భాగంలో లైట్లు ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
>ఆర్టికల్ 70ని ఉల్లంఘించిన వారికి, ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 95లో నిర్దేశించిన విధంగా శిక్షలు వర్తిస్తాయి. ఉల్లంఘించిన వారికి కనీసం ఒక వారం నుండి గరిష్టంగా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష,  కనీసం QR3వేల నుండి గరిష్టంగా QR 10వేల వరకు జరిమానా విధించబడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com