సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!

- April 21, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!

రియాద్ః 2026 మొదటి త్రైమాసికంలో సౌదీ అరేబియాలో ఆస్తి(property) ధరల సూచిక 1.6 శాతం తగ్గాయి. నివాస రంగంలో 3.6 శాతం తగ్గుదల, అలాగే భూమి, అపార్ట్‌మెంట్లు మరియు విల్లాల ధరలలో తగ్గుదల దీనికి ప్రధాన కారణం అని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT)  2026 మొదటి త్రైమాసిక రియల్ ఎస్టేట్ ధరల సూచిక తెలిపింది. నివాస రంగ ధరలలో 3.6 శాతం తగ్గుదల కనిపించగా, వాణిజ్య ఆస్తి ధరలు ఏడాది ప్రాతిపదికన 3.4 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. నివాస ఆస్తి ధరలలో వచ్చిన 3.6 శాతం తగ్గుదలకు... నివాస భూమి ధరలలో 3.9 శాతం తగ్గుదల, అపార్ట్‌మెంట్ ధరలలో 1.1 శాతం తగ్గుదల, విల్లా ధరలలో 6.1 శాతం తగ్గుదల కారణమని ఈ నివేదిక పేర్కొంది. అయితే నివాస అంతస్తుల (floors) ధరలు మాత్రం 0.6 శాతం పెరిగాయి.
దీనికి భిన్నంగా, ప్రస్తుత సంవత్సరం మొదటి త్రైమాసికంలో వాణిజ్య ఆస్తి ధరలు ఏడాది ప్రాతిపదికన 3.4 శాతం పెరిగాయి. వాణిజ్య భూమి ధరలలో 3.6 శాతం పెరుగుదల మరియు భవనాల ధరలలో 2.6 శాతం పెరుగుదల దీనికి దోహదపడ్డాయి. అయితే షోరూమ్‌లు మరియు రిటైల్ దుకాణాల ధరలు మాత్రం 3.5 శాతం తగ్గాయి. వ్యవసాయ రంగం తన వార్షిక వృద్ధి రేటును కొనసాగించిందని కూడా ఈ నివేదిక వెల్లడించింది. వ్యవసాయ భూమి ధరలలో వచ్చిన 11.8 శాతం పెరుగుదల ప్రభావంతో, వ్యవసాయ ధరలు మొత్తంగా 11.8 శాతం పెరిగాయి.
త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే, 2025 నాలుగవ త్రైమాసికంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ ధరలు 0.2 శాతం తగ్గాయి. వాణిజ్య రంగ ధరలలో వచ్చిన 2.3 శాతం తగ్గుదల దీనిపై ప్రభావం చూపింది. నిర్దిష్టంగా చెప్పాలంటే, వాణిజ్య భూమి ధరలు 2.4 శాతం, భవనాల ధరలు 1.3 శాతం మరియు షోరూమ్‌లు, దుకాణాల ధరలు 2.9 శాతం తగ్గాయి. మరోవైపు, నివాస స్థలాల ధరలు (1.7 శాతం), అపార్ట్‌మెంట్ ధరలు (1.6 శాతం) మరియు నివాస అంతస్తుల ధరలు (1 శాతం) పెరగడం వల్ల, నివాస రంగ ధరలు మొత్తం 0.5 శాతం మేర వృద్ధి చెందాయి. అయితే, విల్లా ధరలు మాత్రం 6.2 శాతం తగ్గాయి.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వ్యవసాయ రంగ స్థిరాస్తి ధరలు కూడా 3.1 శాతం మేర వృద్ధిని నమోదు చేశాయి.ఇందులో వ్యవసాయ భూముల ధరలు 3.1 శాతం పెరిగాయి. ప్రాంతీయ స్థాయిలో చూస్తే, 2025 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2026 మొదటి త్రైమాసికంలో రియాద్ ప్రాంతంలో స్థిరాస్తి ధరలు 4.4 శాతం, మక్కా ప్రాంతంలో 0.7 శాతం తగ్గాయి. అల్-బాహా, హాయిల్ మరియు నార్తర్న్ బోర్డర్స్ ప్రాంతాలలో ధరలు అత్యధికంగా తగ్గాయి. ఇవి వరుసగా 9.2 శాతం, 8 శాతం మరియు 5.1 శాతంగా నమోదయ్యాయి. ఇక తూర్పు ప్రావిన్స్ విషయానికి వస్తే, దేశంలోనే అత్యధికంగా 6.9 శాతం స్థిరాస్తి ధరల పెరుగుదలను ఇది నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానంలో నజ్రాన్ ప్రాంతం 3.5 శాతంతో నిలవగా, తబూక్ మరియు అసిర్ ప్రాంతాలు ఒక్కోటి 1.5 శాతం చొప్పున పెరుగుదలను నమోదు చేశాయని నివేదికలో వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com