తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- April 24, 2026
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉద్రిక్తతలకు దారితీసిన తరుణంలో ప్రభుత్వం చర్చలకు సానుకూలత వ్యక్తం చేసింది. సమ్మె విరమణ, డిమాండ్ల పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ఆర్టీసీ జేఏసీ (JAC) నాయకులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు జేఏసీ నాయకులు హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్‌కు చేరుకుని సీనియర్ ఐఏఎస్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు.
సచివాలయానికి వెళ్లే ముందు జేఏసీ నాయకులు తమ కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానం వంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జేఏసీ నిర్ణయించింది. ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. ప్రభుత్వ కమిటీపై నమ్మకంతోనే చర్చలకు వెళ్తున్నామని, అయితే ఈసారి డిమాండ్లపై స్పష్టమైన ‘అగ్రిమెంట్’ రాసుకుని వస్తామని స్పష్టం చేశారు. 32 డిమాండ్లలో 27 పరిష్కరించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రధాన సమస్యలపై చర్చ జరగాల్సి ఉందన్నారు. కార్మికులు ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, జేఏసీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఐఏఎస్ అధికారుల కమిటీతో ప్రాథమిక చర్చలు ముగిసిన అనంతరం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల సబ్ కమిటీతో జేఏసీ నేతలు సమావేశం కానున్నారు. ఈ సబ్ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. పెండింగ్ డిమాండ్లైన విలీనం, పీఆర్‌సీ, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై ఈ భేటీలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. కార్మికులు ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే, రాజకీయ పార్టీలు కార్మికులను రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని, అటువంటి వ్యాఖ్యల వల్లే శంకర్ గౌడ్ వంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









