FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!

- April 29, 2026 , by Maagulf
FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!

దోహా: FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 నవంబర్ 19 నుండి డిసెంబర్ 13, 2026 వరకు జరుగునుంది. ఈ మేరకు FIFA మరియు ఫుట్‌బాల్ ఈవెంట్‌ల స్థానిక నిర్వహణ కమిటీ (LOC) నిర్వాహణ తేదీలను ప్రకటించాయి.   ఈ ప్రతిష్టాత్మక యువజన టోర్నమెంట్ తిరిగి ఖతార్‌కు చేరుకుంది. 2029 వరకు ఖతార్ ఏటా నిర్వహించనున్న వరుసగా ఐదు ఎడిషన్లలో ఇది రెండవది. 48 జట్లతో కూడిన మొట్టమొదటి FIFA పోటీకి ఖతార్ ఆతిథ్యం ఇచ్చిన చారిత్రాత్మక 2025 టోర్నమెంట్ తర్వాత, ఈ సంవత్సరం ఎడిషన్ కూడా అదే విస్తృత ఫార్మాట్‌ను కొనసాగనుంది. 

FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 కోసం మొత్తం 48 జట్లు అర్హత సాధిస్తాయి. దీనికి సంబంధించిన తుది డ్రా మే 21న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో జరగనుంది.  2025లో జరిగిన టోర్నమెంట్‌లో 'కేంద్రీకృత ఆతిథ్య విధానం' (centralised hosting concept) అభిమానులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 15 రోజుల పాటు జరిగిన 104 మ్యాచ్‌లకు మొత్తం 197,460 మంది ఫుట్ బాల్ అభిమానులు హాజరయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌లకు చెందిన మొత్తం 130 మంది 'స్కాట్స్' (talent scouts) కూడా ఈ వేదిక కాంపాక్ట్ స్వభావం వల్ల ప్రయోజనం పొందారు. ఒకే వేదిక నుండి వివిధ జట్ల ప్రతిభను గమనించే అవకాశం వారికి లభించింది. 2025 ఎడిషన్ ఈజిప్టుకు చెందిన హంజా అబ్దుల్కరీమ్, మాలికి చెందిన సెయ్డౌ డెంబెలే, బెల్జియంకు చెందిన జెస్సీ బిసివు మరియు నాథన్ డి క్యాట్, అలాగే ఇటలీకి చెందిన శామ్యూల్ ఇనాసియో వంటి అనేకమంది వర్ధమాన తారలకు ఒక వేదికగా నిలిచిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి 2026 ఎడిషన్‌లో రాబోయే మ్యాచులపై ఉంటుంది. 

FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 ఫైనల్ ప్రముక ఖలీఫా అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. గత సంవత్సరం ఇదే వేదికపై 38,901 మంది ప్రేక్షకుల సమక్షంలో పోర్చుగల్ జట్టు విజేతగా నిలిచింది.

1976లో ప్రారంభించబడిన ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం, ఈ సంవత్సరం తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. తన ఘనమైన చరిత్రలో భాగంగా, ఈ వేదిక చారిత్రాత్మక FIFA ప్రపంచ కప్ ఖతార్ 2022 మ్యాచ్‌లతో సహా అనేక ప్రముఖ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com