మోదీ తెలంగాణ రాష్ట్ర తొలి పర్యటనకు సర్వం సిద్ధo...
- August 06, 2016
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర తొలి పర్యటనకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభోత్సవంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఆయన ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రానికి రానున్నారు. మోదీ చేతుల మీదుగా నల్లా ద్వారా ఇంటింటికీ నీరందించే కార్యక్రమం ప్రారంభానికి మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ ముస్తాబైంది. ప్రధానితోపాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఐదుగురు కేంద్ర మంత్రులు రానుండడంతో పోలీసులు పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీజీ బృందంతో పాటు నలుగురు ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీల పర్యవేక్షణలో మొత్తం 2,400 మంది పోలీసు సిబ్బంది, గ్రేహౌండ్స్ పార్టీలు అణువణువునా నిఘా పెట్టాయి. మొత్తం 170 ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. సొంత వాహనాల్లో వస్తే సభాప్రాంగణానికి చాలా దూరంలో వాటిని నిలిపి రావాల్సి వస్తుందని, అందువల్ల ఆర్టీసీ బస్సుల్లోనే సభకు హాజరుకావాలని అధికారులు చెబుతున్నారు. ప్రజలు తమ వెంట బ్యాగులు, ఇతరత్రా వస్తువులను తీసుకురావద్దని సూచిస్తున్నారు. సభాప్రాంగణం వద్ద 1.50 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా రెయిన్‌ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చేశారు. మరో 50 వేల మంది నీడలో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.మిషన్ భగీరథపై దృశ్యరూప ప్రదర్శన ప్రధాని కోమటిబండపై పైలాన్‌ను ఆవిష్కరించి.. నల్లా ద్వారా నీరు వదిలిన తర్వాత మిషన్ భగీరథ కార్యక్రమంపై రూపొందించిన త్రీడీ దృశ్యరూపకాన్ని సీఎం కేసీఆర్, మిషన్ భగీరథ పథకం వైస్‌ఛైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ఆయనకు వివరించనున్నారు. దీంతో పాటు అక్కడే ఏర్పాటు చేసే ఛాయాచిత్ర ప్రదర్శననూ మోదీ తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికపై మొత్తం 18 మంది కూర్చునేలా చూస్తున్నారు. వేదికకు కుడివైపు ప్రజాప్రతినిధులు, ఎడమ వైపు కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు ఆసీనులయ్యేందుకు మరో రెండు వేదికలు సిద్ధం చేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అనంత్‌కుమార్, వెంకయ్యనాయుడు, సురేష్‌ప్రభు, బండారు దత్తాత్రేయతో పాటు గవర్నర్ నరసింహన్ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రధాని కోసం కోమటిబండపై, ప్రధాన వేదిక వద్ద ప్రత్యేకంగా సూట్లను సిద్ధంగా ఉంచారు. పాస్‌లు అందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్తు ఛైర్మన్లకు సభాప్రాంగణానికి చేరుకునే తొలి చెక్‌పోస్టు వద్దనే పాస్‌లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు ప్రధాన వేదిక చుట్టూ తిరిగేలా రెండు మార్గాలను సిద్ధం చేశారు. దీనిలో ఒక మార్గాన్ని ప్రధాని కోసం కేటాయించారు.పార్టీ నేతలతో సీఎం సమీక్ష: ప్రధాని కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. విజయవంతం చేసేందుకు అన్ని సన్నాహాలు చేయాలని ఆదేశించారు. మంత్రి హరీశ్‌రావు వారం రోజులుగా అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పర్యటన ఏర్పాట్లపై కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్లో మంత్రులు, నేతలతో సమీక్షించారు. విమానాశ్రయంలో స్వాగతం, వీడ్కోలు బాధ్యతలను నేతలకు అప్పగించారు. తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న ప్రధానికి ఘనంగా స్వాగతం పలకాలని సూచించారు.మోదీకి భారీ వినతిపత్రం ప్రధాని పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున భారీ వినతిపత్రం సమర్పించనున్నారు. వేదికపై కొన్ని అంశాలను ప్రస్తావించడంతో పాటు మరికొన్నింటిని లిఖితపూర్వకంగా అందజేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు ఆర్థికసాయం, రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు, ఇతర విభజన హామీలను ఆయన నివేదించనున్నారు.తె లంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రానికి తొలిసారిగా వస్తున్న ప్రధాని మోదీ ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిషన్ భగీరథ మొదటి దశను ప్రారంభించిన అనంతరం బహిరంగసభ వేదిక వద్దకు వస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి రామగుండంలోని 1600 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్కేంద్రం, ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్లకు శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. వరంగల్‌లోని కాళొజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ ప్రారంభం, ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లోని సింగరేణి 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్కేంద్రం జాతికి అంకితం చేసే శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్వాగతోపన్యాసం అనంతరం సీఎం కేసీఆర్, తర్వాత ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.20కి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్న ప్రధాని కార్యక్రమం దాదాపు రెండు గంటలపాటు సాగుతుంది. 4.30కి గజ్వేల్ నుంచి హైదరాబాద్ చేరుకునే ఆయన ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భాజపా కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







