పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

- May 07, 2026 , by Maagulf
పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

అమరావతి: కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఉత్తమ విధానాలను ప్రజెంట్ చేయించడం ద్వారా కలెక్టర్లు వినూత్నంగా ఆలోచిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విధానం ద్వారా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండడంతో కలెక్టర్లు వినూత్నంగా ఆలోచిస్తున్నారన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల తొలి రోజు సమావేశంలో నాలుగు జిల్లాల కలెక్టర్లు వారు అవలంభించిన ఉత్తమ పద్దతులను ప్రజెంట్ చేశారు. స్వాభిమాన్ పేరిట దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రజెంట్ చేశారు. వ్యవసాయం, అక్వాకల్చర్ వ్యర్ధాలను హై వ్యాల్యూ బయో ప్రాడెక్ట్సుగా మలిచే సర్క్యులర్ ఎకానమీ బ్లూ ప్రింట్ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ వివరించారు. అలాగే కోకో ద్వారా చాక్లెట్ తయారీలో మహిళల భాగస్వామ్యంపై మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని పేరుతో గ్రామస్థాయిలో ఆరోగ్య పరిరక్షణా కార్యక్రమంపై పలనాడు జిల్లా కలెక్టర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా శెట్టిపల్లి మోడల్ టౌన్ షిప్ రూపకల్పనపై తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రజెంట్ చేశారు. గతంలో కూడా వివిధ జిల్లాల కలెక్టర్లు బెస్ట్ ప్రాక్టీసెస్ ను ప్రజెంట్ చేశారు. దీంతో మొత్తంగా తొమ్మిది బెస్ట్ ప్రాక్టీసెస్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పద్దతులను అమలు జరిగేలా మానిటర్ చేసే బాధ్యతలను వారికే అప్పగించారు. ఈ మేరకు సదురు జిల్లా కలెక్టర్లనే మెంటార్లుగా సీఎం ప్రకటించారు. అలాగే జలధార సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”ఉత్తమ పద్దతుల విధానాన్ని ప్రవేశపెట్టడంతో మూసపద్దతి ఆలోచనల నుంచి కలెక్టర్లు బయటకు వస్తున్నారు. ఇలాంటివి అమలు చేస్తే ప్రజలకు చక్కటి సేవలు అందుతాయి. వినూత్న ఆలోచనల ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు వస్తాయి. కలెక్టర్లు అమలు చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ ద్వారా ప్రజల్లో అవగాహన కూడా కలుగుతోంది. ప్రజలకు మేలు జరిగేలా.. లబ్ది చేకూరేలా ఉత్తమ పద్ధతులను అమలు చేస్తే ప్రజల నుంచి ఆదరణ కూడా లభిస్తుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ ద్వారా జిల్లాల్లో అత్యుత్తమ విధానాలు రాష్ట్రంలో అమలు అయ్యేందుకు అవకాశం ఏర్పడింది. ల్యాండ్ పూలింగ్ లాంటి వినూత్న ప్రక్రియ ద్వారా తిరుపతి జిల్లా శెట్టిపల్లిలో ప్రజలకు, ప్రభుత్వానికి ఆస్తి చేకూరింది. రాష్ట్రంలో లిటిగేషన్లు అన్ లాక్ కావాలి. అప్పుడే వివాదాలు పరిష్కారమై సంతోషంగా ఉంటారు. సింగపూర్ లో అనుసరించిన అత్యుత్తమ విధానాలను అమలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం.”అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఉత్తమ పద్దతుల పర్యవేక్షణకు సీఎం చంద్రబాబు ప్రకటించిన మెంటార్ల వివరాలు:

స్మార్ట్ కిచెన్స్ - కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, సంజీవని ప్రాజెక్టు - చిత్తూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు సుమిత్, కృతికా శుక్లా, జలధార ప్రాజెక్టు - అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా ఫోర్ విజిట్స్ ఏ విలేజ్ కాన్సెప్ట్ - నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ముస్తాబు-పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, నెట్ జీరో కాన్సెప్ట్ - అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, దివ్యాంగులకు ఆసరాగా ఉండే స్వాభిమాన్ - శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఆక్వా, వ్యవసాయ వ్యర్థాల సమర్థ వినియోగం-సర్కులర్ ఎకానమీ - పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, అన్ లాకింగ్ వెల్త్ కాన్సెప్ట్ - తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.

జలధారతో విద్యుత్ ఆదా...

“జలధార-జలహారతి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. నీటి వనరులను కాపాడుకోవాలి. భూగర్భ జలాలు పెంచాలి... వర్షపు నీటిని ఒడిసి పట్టేలా కాల్వలను, చెరువులను బాగు చేసుకోవాలి. జలధారతో భూగర్భ జలాలు పెరిగితే.. బోర్ల వినియోగం తగ్గుతుంది.. విద్యుత్ ఆదా అవుతుంది. ఇది తక్షణం జరగకున్నా.. భవిష్యత్తులో ఈ కార్యక్రమంతో ఎంతో మేలు జరుగుతుంది. ఇక ప్రతీ జిల్లాలోనూ ఆర్టీఐహెచ్ స్పోక్ మోడళ్లను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వానికి కావాల్సిన ఏఐ సొల్యూషన్లను ఆర్టీఐహెచ్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. 8, 9, 10 తరగతుల విద్యార్ధులకు స్టూడెంట్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ త్వరలో నిర్వహిద్దాం. జిల్లా కలెక్టర్లు డీపీఐసీ సమావేశాన్ని నిర్వహించాల్సిందే. వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమానికి ఊతమిచ్చేలా పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చేలా చూడాలి. ఎలాంటి వివాదాలు లేకుండా ఏపీలో భూసేకరణ జరుగుతోంది. అభివృద్ధిలో భూయజమానుల్ని భాగస్వాములుగా మారుస్తున్నాం. రాజధానికి 33 వేల ఎకరాల భూ సమీకరణ ఓ వినూత్న ప్రక్రియ. అనంతపురంలో సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడితో డిఫెన్సు పరిశ్రమ వస్తోంది. 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభిస్తుంది. సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీకి, ఉద్యాన ఉత్పత్తులకు కేంద్రంగా రాయలసీమ మారుతుంది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. చిత్తూరు జిల్లా కోసల నగరం ప్రాంతం కూడా మరో శ్రీ సిటీగా తయారు చేయాలి. చెన్నై నుంచి పెద్ద ఎత్తున పరిశ్రమలు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో పర్యాటకానికి ఊతం ఇచ్చేలా 50 వేల హోటల్ గదులు నిర్మాణం పూర్తి చేస్తాం. వ్యవసాయం రంగం నుంచి 10 శాతం జీడీపీ కంట్రిబ్యూషన్ ఉంది. త్వరలో అది 15 శాతానికి పెరుగుతుంది. అక్వా, హార్టీ కల్చర్ రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. అరకు కాఫీ లాంటి ఉత్పత్తి ఒక్కటే అల్లూరి జిల్లా ఎకానమీని మారుస్తోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది క్షేత్రస్థాయిలో కనిపించాలి. జిల్లా ప్లానింగ్ బోర్డు చైర్మన్లుగా ఉన్న మంత్రులతో సమన్వయం చేసుకోవాలి.”అని ముఖ్యమంత్రి సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com