ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- August 12, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా లభ్యమయ్యే బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించి, వాటిని దేశ అవసరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి రాకుండా రాష్ట్రంలోనే విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్ర సచివాలయంలో బుధవారం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో అదానీ గ్రూప్ ప్రతిపాదించిన సుమారు రూ.16 వేల కోట్ల పెట్టుబడితో టైటానియం ప్లాంట్ ఏర్పాటు, బీచ్‌శాండ్ మైనింగ్, వాటికి ఉన్న డిమాండ్ తదితర అంశాలపై చర్చించారు.
బీచ్‌శాండ్ నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు
బీచ్‌శాండ్‌లో లభించే ఇల్మెనైట్ మినరల్‌కు విలువ జోడించడం ద్వారా టైటానియం స్లాగ్, TiO₂, టైటానియం స్పాంజ్ వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చని అదానీ గ్రూప్ ప్రతినిధులు సీఎంకు వివరించారు.
TiO₂ను పెయింట్స్, కోటింగ్స్, కాస్మెటిక్స్, ప్లాస్టిక్, పాలిమర్స్, అల్ట్రావయొలెట్ (UV) రక్షణ ఉత్పత్తులు తదితర రంగాల్లో విస్తృతంగా వినియోగించవచ్చని తెలిపారు. రాష్ట్రంలోనే ఈ మినరల్స్‌కు విలువ జోడించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధితో పాటు దేశ అవసరాలను తీర్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
విశాఖలో భారీ పెట్టుబడుల ప్రతిపాదనలు
విశాఖపట్నంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం, అదానీ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. అలాగే 1,000 పడకల అదానీ ఆరోగ్య మందిర్ ఆసుపత్రి, 150 సీట్ల మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
విశాఖలో అదానీ డేటా సెంటర్, ఐటీ పార్క్ నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ వివరాలను కూడా ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రికి వివరించింది.
రాష్ట్రంలో లభ్యమయ్యే సహజ వనరులను కేవలం ముడి పదార్థాలుగా కాకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు గనుల శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!







