రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- May 08, 2026
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా ఖండించారు.రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాల పట్ల కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని రాజకీయ కక్షసాధింపులు, ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసమే మళ్లించడం వల్లే.. ప్రజల రక్షణ, భద్రత గాలిలో కలిసిపోయిందని ఆయన విమర్శించారు.ఈ మేరకు రాష్ట్రంలోని పరిస్థితుల పైన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు.
శాంతిభద్రతల క్షీణతపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్లో రిటైర్డ్ డీజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య అత్యంత దారుణంగా హత్యకు గురైన వార్త రావడం దిగ్భ్రాంతికరమని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా, నిన్న రాత్రి సికింద్రాబాద్లో నడిరోడ్డుపై ఒక యువకుడిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిందని, ఇది సామాన్య పౌరుల్లో పెరుగుతున్న అభద్రతా భావానికి అద్దం పడుతోందని ఆయన అన్నారు.
నేరాల నివారణ, ప్రజా భద్రతపై దృష్టి పెట్టాల్సిన పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను.. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రభుత్వ తీరును విమర్శించే సోషల్ మీడియా గొంతులపై అక్రమ కేసులు బనాయించేందుకు వాడుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు.
"పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షసాధింపు చర్యలకు వాడుకోవడం వల్లనే శాంతిభద్రతలు కుప్పకూలాయని " అని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు భారీగా పెరిగినట్లు తాజా ఎన్సీఆర్బీ (NCRB) నివేదికలు చెబుతున్నాయని, ఇది ప్రస్తుత ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని ఆయన గుర్తుచేశారు.
హోం శాఖను కూడా తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రజల ఆస్తిపాస్తులను, ప్రాణాలను రక్షించడంలోనూ, శాంతిభద్రతలను కాపాడటంలోనూ ఘోరంగా విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాజకీయ వేధింపులు ఆపి, పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రజల్లో భరోసా కల్పించేలా వృత్తిపరంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!







