సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- May 09, 2026
సైబరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులతో ఈరోజు సైబరాబాద్ సీపీ కార్యాలయ ఆడిటోరియంలోఈ రోజు ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో బ్యాంకులు మరియు పోలీసుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం ద్వారా దర్యాప్తును వేగవంతం చేయడం, ముఖ్యంగా మ్యూల్ అకౌంట్ల (Mule Accounts) నియంత్రణ, ఖాతాల ఫ్రీజ్ మరియు డిఫ్రీజ్ ప్రక్రియలు, బాధితులకు నగదు వాపసు ఇవ్వడం మరియు డిజిటల్ మోసాల విచారణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేష్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా మారాయని తెలిపారు. ఆన్లైన్ స్కామ్‌లు, నకిలీ పెట్టుబడి పథకాలు, ప్రీ-లాంచ్ ఆఫర్లు, కాల్ సెంటర్ మోసాలు, క్రిప్టో కరెన్సీ స్కామ్‌లు తదితరాల ద్వారా ప్రజలు భారీ మొత్తంలో డబ్బును కోల్పోతున్నారని అన్నారు. చాలామంది తమ జీవితకాల పొదుపులను కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలో 2025 సంవత్సరంలో సైబర్ మోసాల కారణంగా ప్రజలు రూ.438 కోట్లను కోల్పోగా, 2026 సంవత్సరంలో ఇప్పటివరకు రూ.104 కోట్లను కోల్పోయినట్లు వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా అవగాహన పెరుగుతున్నప్పటికీ, మరింత అప్రమత్తత మరియు పటిష్టమైన నివారణ చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. బ్యాంకింగ్ డేటా భద్రత, మ్యూల్ అకౌంట్ల నియంత్రణ, దర్యాప్తులకు బ్యాంకుల నుంచి సకాలంలో సహకారం ఎంతో ముఖ్యమని తెలిపారు.
ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించడానికి ప్రతి బ్యాంకులో ప్రత్యేకమైన మరియు కేంద్రీకృత 'సైబర్ సెల్స్' ఏర్పాటు చేయాలని సీపీ కోరారు. ప్రజలు కూడా పెట్టుబడులు పెట్టే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మరియు నేరగాళ్లకు సహకరించవద్దని విజ్ఞప్తి చేశారు.
దర్యాప్తులో ఎదురవుతున్న సవాళ్ల గురించి సైబర్ క్రైమ్ డీసీపీ టి.సాయి మనోహర్ మాట్లాడుతూ, బ్యాంకుల నుండి ఖాతా వివరాలు, కేవైసీ (KYC) పత్రాలు మరియు ఫ్రీజ్ కన్ఫర్మేషన్లు అందడంలో జరుగుతున్న ఆలస్యం వల్ల నిందితులను పట్టుకోవడం కష్టమవుతోందని తెలిపారు. మ్యూల్ అకౌంట్లను నియంత్రించడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని, ఒకసారి ఖాతాను ఫ్రీజ్ చేసిన తర్వాత ఎలాంటి డెబిట్ లావాదేవీలు జరగకుండా చూడాలని బ్యాంకర్లకు సూచించారు. ఖాతాల ఫ్రీజ్ మరియు డిఫ్రీజ్ ప్రక్రియల్లో జరుగుతున్న ఆలస్యంపై కూడా చర్చించారు.
సీఎస్బీ ఎస్పీ సాయి శ్రీ ఎన్సీఆర్బీ (NCRB) డాటాను విశ్లేషిస్తూ, ప్రతి బ్యాంకులో అప్డేట్ చేయబడిన నోడల్ ఆఫీసర్ వివరాలతో కూడిన 'సైబర్ క్రైమ్ రెస్పాన్స్ డెస్క్' ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల కమ్యూనికేషన్ వేగవంతం కావడమే కాకుండా, కస్టమర్ల సొమ్మును కాపాడవచ్చునని తెలిపారు. బ్యాంక్ సిబ్బందికి సైబర్ నేరాల ప్రక్రియలపై శిక్షణ ఇవ్వాలని మరియు కార్పొరేట్ ఖాతాలకు సంబంధించిన రిలేషన్ షిప్ మేనేజర్ల వివరాలను పంచుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్, కుత్బుల్లాపూర్ డీసీపీ కోటి రెడ్డి, క్రైమ్స్ డీసీపీ ఏ.ముత్యం రెడ్డి, సైబర్ క్రైమ్స్ డీసీపీ టి.సాయి మనోహర్, సీఎస్బీ ఎస్పీ సాయి శ్రీ మరియు హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ..
- రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై హైదరాబాద్‌లో జాతీయ సదస్సు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!









