అమెరికాకు టెన్షన్ పెడుతున్న ఇరాన్ ‘దోమల దండు’ వ్యూహం
- May 09, 2026
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి కేంద్రంగా ఇరు దేశాలు ఒకదానికొకటి హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఇరాన్ వ్యూహం “మస్కిటో ఫ్లీట్”. తెలుగులో దీనిని “దోమల దండు” అని పిలుస్తున్నారు.
ఈ పేరు వింటే నిజమైన దోమల గుంపు అనిపించినా.. ఇది అసలు ఇరాన్ సముద్ర రక్షణ వ్యూహానికి సంబంధించిన పదం. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉపయోగిస్తున్న వందలాది చిన్న స్పీడ్ బోట్లను పాశ్చాత్య రక్షణ నిపుణులు “మస్కిటో ఫ్లీట్”గా పిలుస్తున్నారు. దోమలు గుంపులుగా వచ్చి ఇబ్బంది పెట్టినట్లే.. ఈ చిన్న బోట్లు భారీ యుద్ధ నౌకలను చుట్టుముట్టి వేధిస్తాయి. అందుకే ఈ వ్యూహానికి ఆ పేరు వచ్చింది.
ఇరాన్ ఈ వ్యూహాన్ని 1980లలోనే అభివృద్ధి చేయడం ప్రారంభించింది. భారీ యుద్ధ నౌకలు నిర్మించడంపై ఖర్చు పెట్టడం కంటే చిన్న, వేగవంతమైన ఆయుధ వ్యవస్థలతో శత్రువులను ఇబ్బంది పెట్టడం ఉత్తమమని ఇరాన్ భావించింది.
ప్రస్తుతం ఇరాన్ వద్ద సుమారు 1500 వరకు ఫాస్ట్ అటాక్ బోట్లు ఉన్నట్లు సమాచారం. ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉండటం వల్ల ఆధునిక రాడార్ వ్యవస్థలకు సులభంగా చిక్కవు. హోర్ముజ్ జలసంధి చాలా ఇరుకైన సముద్ర మార్గం కావడంతో పెద్ద యుద్ధనౌకలు అక్కడ వేగంగా కదలడం కష్టమవుతుంది. ఈ బలహీనతనే ఇరాన్ ప్రధాన ఆయుధంగా మార్చుకుంది.
ఇరాన్ ఉపయోగిస్తున్న కామికేజ్ డ్రోన్లు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్నారు. ఇవి పేలుడు పదార్థాలతో నిండి శత్రు నౌకలను నేరుగా ఢీకొని పేలిపోతాయి. ఇటీవల జరిగిన దాడుల్లో ఇలాంటి డ్రోన్ల వినియోగం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇవి మాత్రమే కాదు.. ఇరాన్ వద్ద నిఘా డ్రోన్లు, సముద్ర మైన్లను గుర్తించే ప్రత్యేక డ్రోన్లు కూడా ఉన్నాయి. అమెరికా నౌకల కదలికలను రహస్యంగా గమనించి సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో ఇరాన్ వద్ద వందల సంఖ్యలో మిసైల్ బోట్లు కూడా ఉన్నాయి. వీటిపై షార్ట్ రేంజ్ గైడెడ్ క్షిపణులను అమర్చి సమీపం నుంచే దాడులు చేసే సామర్థ్యం కల్పించారు. ఇంకా “అజదార్” అనే మానవరహిత అండర్ వాటర్ వాహనం కూడా ఇరాన్ వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇది నీటి అడుగున ప్రయాణించడం వల్ల గుర్తించడం చాలా కష్టమవుతోంది.
అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకాదళాన్ని కలిగి ఉన్నప్పటికీ.. ఈ చిన్న బోట్లు, డ్రోన్లు మాత్రం దానికి పెద్ద సవాల్‌గా మారాయి. హోర్ముజ్ జలసంధిలో భారీ విమాన వాహక నౌకలను పంపడంలో కూడా అమెరికా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. చిన్న బోట్లను అడ్డుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఖరీదైన రక్షణ క్షిపణులను వినియోగించాల్సి వస్తోంది. దీంతో వారి రక్షణ వ్యయం భారీగా పెరుగుతోంది.
ఈ చిన్న బోట్లు సాధారణ చేపల వేట పడవల్లా కనిపిస్తూ అకస్మాత్తుగా దాడులకు దిగడం మరో పెద్ద సమస్యగా మారింది. ఏది సాధారణ పడవో, ఏది యుద్ధ బోటో గుర్తించడం కూడా కష్టమవుతోంది. భారీ ఆయుధాల కంటే సరైన వ్యూహమే యుద్ధాల్లో కీలకమని ఇరాన్ “మస్కిటో ఫ్లీట్” మరోసారి నిరూపిస్తోంది. ప్రపంచంలోనే శక్తివంతమైన అమెరికా నౌకాదళాన్ని కూడా ఈ వ్యూహం ఆందోళనకు గురిచేస్తోంది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్‌పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







