వన్యప్రాణుల సంరక్షణలో భారత్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

- May 11, 2026 , by Maagulf
వన్యప్రాణుల సంరక్షణలో భారత్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ వర్క్‌షాప్ ప్రారంభం

హైదరాబాద్: వన్యప్రాణుల సంరక్షణ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. పులులు, చిరుతలు, ఆసియా సింహాలు, మంచు చిరుతలు వంటి పెద్ద పిల్లి జాతుల సంరక్షణలో భారత్ ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు తెలంగాణ అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో “షేర్డ్ స్ట్రైప్స్–షేర్డ్ ఫ్యూచర్” అనే థీమ్‌తో నిర్వహించిన అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (IBCA) రెండు రోజుల వర్క్‌షాప్‌ను గవర్నర్ ప్రారంభించారు.

“వన్యప్రాణుల సంరక్షణ నాగరికతకు ప్రతీక”

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, భవిష్యత్ తరాల భద్రత, అడవుల పరిరక్షణ కోసం వన్యప్రాణుల సంరక్షణ అత్యంత కీలకమన్నారు. భారతీయ సంస్కృతి ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణుల పట్ల గౌరవం, సహజీవన భావనతో ముందుకు సాగిందని పేర్కొన్నారు.

“వన్యప్రాణుల సంరక్షణ కేవలం పర్యావరణ బాధ్యత మాత్రమే కాదు…అది నాగరికతకు ప్రతీక” అని ఆయన వ్యాఖ్యానించారు.

నెహ్రూ జూ సేవలు అభినందనీయం

నెహ్రూ జూలాజికల్ పార్క్ దేశంలోని అతిపెద్ద, అత్యుత్తమ జంతు ప్రదర్శన పార్క్‌లలో ఒకటిగా నిలిచిందని గవర్నర్ కొనియాడారు. వన్యప్రాణుల సంరక్షణ, సంతానోత్పత్తి, ప్రజల్లో అవగాహన కల్పించడంలో జూ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

టైగర్ సఫారీ, అంతరించిపోతున్న జాతుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని తెలిపారు.

“IBCA ప్రపంచ దేశాలకు వేదిక”

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ “ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్” వంటి చారిత్రాత్మక కార్యక్రమాన్ని చేపట్టిందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ వేదిక ద్వారా ప్రపంచ దేశాలు సంరక్షణ, పరిశోధన, అనుభవాలను పరస్పరం పంచుకునే అవకాశం కలుగుతోందన్నారు.

భారతదేశం సాధించిన అనుభవం ఆసియా, ఆఫ్రికా దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని చెప్పారు.

తెలంగాణ జీవవైవిధ్యానికి నిలయం

తెలంగాణ రాష్ట్రం గొప్ప జీవవైవిధ్యానికి నిలయమని గవర్నర్ తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ అభయారణ్యం వంటి పులి సంరక్షణ కేంద్రాలు రాష్ట్ర ప్రత్యేకతను చాటుతున్నాయని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం హరితాభివృద్ధి, ప్రజా భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు

రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

జూలో పర్యటన

కార్యక్రమం అనంతరం గవర్నర్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో పెద్ద పులులు, ఇతర అటవీ జంతువులను పరిశీలించారు. జూలో ఏర్పాటు చేసిన అటవీ జంతు చిత్రాల ప్రదర్శనను కూడా తిలకించారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, పరిరక్షణ కార్యకర్తలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com