మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..

- May 11, 2026 , by Maagulf
మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..

 హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన నేపాలీ పనిమనిషిని సోమవారం పుణెలో అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్యను.. కల్పన అనే నేపాలీ పనిమనిషి హత్య చేసి పరారైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

నిందితురాలు కల్పన తన ఇద్దరు సహచరులతో కలిసి బాధితురాలు తనుజా రంజన్ రాయ్‌ను బంధించి, ఇంట్లోని బంగారం, నగదు దోచుకుని పరారైంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. 10 బృందాలను రంగంలోకి దింపారు.

తాజా సమాచారం ప్రకారం.. చోరీ అనంతరం నిందితురాలు కల్పన పుణెలోని తన సోదరి ఇంటికి వెళ్లి అక్కడే తలదాచుకున్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు పుణె చేరుకుని.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితురాలు కల్పనను నగరానికి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ దారుణంలో ఆమెకు సహకరించిన మరో ఇద్దరు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు.

అసలేం జరిగిందంటే..
మే 8వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో పనిమనిషి కల్పన, ఆమె సహచరులు ఇంట్లో చోరీకి పాల్పడుతూ.. తనుజా రంజన్ రాయ్ కళ్లకు చిక్కారు. ఆమె నిందితులను అడ్డుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో నిందితులు తనుజా రంజన్ రాయ్ చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కారు. దీంతో ఆమె ఊపిరాడక మృతి చెందింది. ఈ చోరీ జరిగిన సమయంలో వినయ్ రంజన్ రాయ్ పని మీద బయట ఊరు వెళ్లగా, కల్పన జూబ్లీహిల్స్‌లోని ఐపీఎస్ క్వార్టర్స్‌లో ఉన్న వారి నివాసంలో మొదటి అంతస్తులో ఒంటరిగా ఉంటోంది.

దీని గురించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. ఘటన జరిగిన సమయంలో రంజన్ రాయ్ పిల్లలు ఇంటి మొదటి అంతస్తులోనే ఉన్నారని తెలిపారు. రంజన్ రాయ్.. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి బాగోగులు చూసుకోవడం కోసం ఎనిమిది నెలల క్రితం కల్పనను పనిలో చేర్చుకున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ఇంట్లో ఉన్న బంగారం, డబ్బుల మీద కన్నేసిన కల్పన.. వినయ్ ఇంట్లో లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని చోరీకి ప్లాన్ చేసింది. తన ఇద్దరు సహచరులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన నేపథ్యంలో నేపాలీ వ్యక్తులను ఇంటి పనుల కోసం నియమించుకునేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనర్ హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com