మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం

- May 11, 2026 , by Maagulf
మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం

జాతీయ రహదారులు, బందరు పోర్ట్ కనెక్టివిటీ, ఫ్లైఓవర్లపై కీలక చర్చ

న్యూఢిల్లీ: మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి ఉమా శంకర్ IAS‌ను కలిసి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక మౌలిక వసతుల అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా జాతీయ రహదారుల అభివృద్ధి, గుడివాడ–కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, బందరు పోర్ట్ కనెక్టివిటీ రోడ్లు, బైపాస్ రోడ్ల నిర్మాణం, గుడివాడ పట్టణ కనెక్టివిటీ వంటి అంశాలను ఎంపీ బాలశౌరి కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు.

గుడివాడ–కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్‌ పై చర్చ

గుడివాడ–కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ప్రాంతీయ రవాణా వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వివరించారు.

బందరు పోర్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ అవసరం

బందరు పోర్ట్ అభివృద్ధికి మెరుగైన రహదారి అనుసంధానం అత్యంత అవసరమని ఎంపీ తెలిపారు. పోర్ట్ కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధి ద్వారా పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య విస్తరణ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర కార్యదర్శికి వివరించారు.

బైపాస్ రోడ్లు, పట్టణ ట్రాఫిక్ సమస్యల పై విజ్ఞప్తి

పట్టణ ప్రాంతాల్లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని బైపాస్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఎంపీ కోరారు. గుడివాడ పట్టణానికి మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విజయవాడలో ఎలివేటెడ్ కారిడర్, ఫ్లైఓవర్ ప్రతిపాదనలు

విజయవాడ–బందరు రోడ్డులోని జాతీయ రహదారి-65పై నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఎలివేటెడ్ కారిడర్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. అలాగే మహానాడు సెంటర్ నుంచి రామవరప్పాడు (కే హోటల్ వరకు) ఫ్లైఓవర్ నిర్మాణంపై కూడా చర్చించినట్లు సమాచారం.

సానుకూలంగా స్పందించిన కేంద్ర కార్యదర్శి

ఎంపీ బాలశౌరి ప్రతిపాదనలను కేంద్ర కార్యదర్శి ఉమా శంకర్ IAS సానుకూలంగా స్వీకరించారు. సంబంధిత అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ బాలశౌరి ఈ సందర్భంగా కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com