సైబర్ నేరాల నిర్మూలనకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: ఏపీ డీజీపీ..

- May 15, 2026 , by Maagulf
సైబర్ నేరాల నిర్మూలనకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: ఏపీ డీజీపీ..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న సైబర్‌ నేరాలపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీ సైబర్‌ గార్డ్‌ ఆపరేషనల్‌ ప్లాన్‌తో పాటు సైబర్‌ క్రైమ్‌ నిర్వహణ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై ఏపీ డీజీపీ హరీశ్ కుమార్‌ గుప్తా ఈరోజు (శుక్రవారం) వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, రేంజ్‌ అధికారులు, టెక్నికల్‌ సర్వీసెస్‌ విభాగం అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఎప్పటికప్పుడు ముందంజలో కొనసాగుతోందన్నారు. అయితే ఇటీవలి కాలంలో సైబర్‌ నేరాలు పెరిగాయన్నారు. దీంతో సైబర్‌ నేరాల నియంత్రణ వ్యవస్థను అత్యవసరంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని డీజీపీ అభిప్రాయపడ్డారు. పోలీస్‌ శాఖ, ఐటీ శాఖతో పాటు ఇతర అనుబంధ సంస్థలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన అనంతరం 90 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు.

సైబర్‌ నేరాల నియంత్రణ బాధ్యత కేవలం ప్రత్యేక విభాగాలకే పరిమితం కాకుండా ప్రతి జిల్లా పోలీస్‌ యంత్రాంగం చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్‌ మోసాల బాధితులకు తక్షణ సహాయం అందించడంలో గోల్డెన్‌ అవర్‌ అత్యంత కీలకమని డీజీపీ స్పష్టం చేశారు. 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు వచ్చిన తొలి 30 నిమిషాల్లోనే చర్యలు ప్రారంభిస్తే బాధితులు కోల్పోయిన డబ్బును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com