ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు
- May 19, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ తీసుకున్న నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వ నూతన విధానాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు దారిలోకి వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఏపీలో యధేచ్ఛగా సర్వీసులు నడుపుతున్న ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఇప్పుడు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
కేంద్రం నిబంధనలతో ప్రైవేట్ ఆపరేటర్లకు చుక్కలు
ఇప్పటివరకు చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పన్నులు తప్పించుకోవడానికి లేదా తక్కువ ఖర్చుతో ముగించడానికి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో తమ బస్సులను రిజిస్ట్రేషన్ చేయించేవారు. అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (AITP) ద్వారా ఆంధ్రప్రదేశ్లో యధేచ్ఛగా తిప్పేవారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన పాలసీ వీరి ఆటలకు అడ్డుకట్ట వేసింది. ఈ కొత్త నిబంధన ప్రకారం, ఏ రాష్ట్రంలోనైతే వాహనం రిజిస్టర్ అయిందో, ఆ వాహనం ప్రతి రెండు నెలలకోసారి కచ్చితంగా ఆ రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఏపీలో తిరిగే బస్సులను ప్రతి రెండు నెలలకూ ఈశాన్య రాష్ట్రాలకు తీసుకెళ్లడం రవాణా ఖర్చులు, సమయం దృష్ట్యా యాజమాన్యాలకు పెను భారంగా మారింది.
ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం–తగ్గిన ఏఐటీపీ చార్జీలు ప్రైవేట్ ఆపరేటర్లపై కేంద్ర నిబంధనల ఒత్తిడి ఒకవైపు ఉంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఊరటనిచ్చేలా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (AITP) చార్జీలను భారీగా తగ్గించింది. గతంలో సీటుకు నెలకు ₹4,000 గా ఉన్న ఈ పర్మిట్ చార్జీలను ప్రభుత్వం ఇప్పుడు ₹2,500 లకు కుదించింది. ఒకవైపు ఈశాన్య రాష్ట్రాలకు బస్సులు తిప్పలేక సతమతమవుతున్న యజమానులకు, ఏపీ ప్రభుత్వ చార్జీల తగ్గింపు ఒక సువర్ణావకాశంగా కనిపించింది. పక్క రాష్ట్రాలకు వెళ్లి తిప్పే ఖర్చు కంటే, ఇక్కడే పన్ను తగ్గడంతో ఏపీలోనే రీ-రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లాభదాయకమని ఆపరేటర్లు భావిస్తున్నారు.
ఏపీలోనే రీ-రిజిస్ట్రేషన్లు..పెరుగుతున్న ఆదాయం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ సరికొత్త పద్ధతుల వల్ల ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు వేగంగా స్పందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసుకుని, ఏపీలోనే తమ వాహనాలను రీ-రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపు 141 ప్రైవేట్ బస్సులు ఆంధ్రప్రదేశ్లో రీ-రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాయని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (JTC) శివరామప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు కూడా ఇక్కడే రిజిస్టర్ కానున్నాయి. దీనివల్ల ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి అడ్డుకట్ట పడటమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖకు పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరనుంది.
తాజా వార్తలు
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు
- రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. CM విజయ్ సంచలన నిర్ణయం
- నకిలీ ట్రావెల్ ఆఫర్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- గత 48 గంటల్లో 6 శత్రు డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు
- రేపు 20వ తేదీ దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
- టాప్-100 IASల్లో తెలంగాణ ఆఫీసర్లు ముగ్గురు
- ఎబోలా భయంతో మూడు దేశాల ప్రయాణికుల ప్రవేశంపై బహ్రెయిన్ ఆంక్షలు
- ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్









