ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్
- May 19, 2026
2026లో సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు
ఫుజైరా: యూఏఈ జాతీయ రైల్వే ప్రాజెక్ట్ అయిన ఎతిహాద్ రైల్, ఫుజైరాలో తన తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఏడాది చివర్లో దశలవారీగా ప్రయాణికుల రైలు సేవలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ స్టేషన్‌ను సిద్ధం చేశారు.
ఫుజైరాలోని మదీనత్ అల్ హిలాల్ ప్రాంతంలో నిర్మించిన ఈ స్టేషన్ 51,900 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఎతిహాద్ రైల్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అధ్రా అల్ మన్సూరి మాట్లాడుతూ, ఈ స్టేషన్ ఫుజైరాలోని ప్రధాన పర్యాటక, వాణిజ్య ప్రాంతాలకు సమీపంలో వ్యూహాత్మకంగా నిర్మించబడిందని తెలిపారు.
ఫుజైరా అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు 12 నిమిషాల దూరంలో, అంబ్రెల్లా బీచ్ కార్నిష్కు 6 నిమిషాలు, సకమ్కమ్ కోటకు 5 నిమిషాల దూరంలో ఈ స్టేషన్ ఉందన్నారు.
ఈ రైల్వే సేవల ద్వారా ఫుజైరా, దుబాయ్, అబుదాబి నగరాల మధ్య రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని, పలు రంగాల్లో పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఫుజైరా నుంచి అబుదాబికి ప్రయాణ సమయం కేవలం 105 నిమిషాలకే పరిమితం కానుంది.
గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైళ్లలో ఒకేసారి 400 మంది ప్రయాణికులు ప్రయాణించగలుగుతారు. జాతీయ రైల్వే నెట్వర్క్ నిర్మాణంలో ఉపయోగించిన సామగ్రిలో 70 శాతం దేశీయంగా 97 స్థానిక సరఫరాదారుల నుంచి సేకరించినట్లు అధికారులు తెలిపారు.
మొదటి దశలో అబుదాబి, దుబాయ్, ఫుజైరాలను అనుసంధానించే మూడు ప్రధాన మార్గాలను ఒకేసారి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రైళ్ల సమయ పట్టికలను సేవలు ప్రారంభానికి సమీపంలో అధికారికంగా ప్రకటించనున్నారు.
ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఎతిహాద్ రైల్ తెలిపింది. స్టేషన్లో రిటైల్ షాపులు, వీఐపీ లౌంజ్, హైస్పీడ్ వైఫై, ప్రత్యేక డైనింగ్ కారేజీలు, ఆటోమేటెడ్ టికెట్ చెల్లింపు యంత్రాలు, విశ్రాంతి ప్రాంతాలు, ప్రయాణికుల సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ ఆధునిక సదుపాయాలతో యూఏఈలో రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మార్చడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్







