బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!

- May 23, 2026 , by Maagulf
బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!

మనామా: బహ్రెయిన్ లోనే అత్యంత పురాతనమైన హోటల్ అయిన బహ్రెయిన్ హోటల్‌ను, ప్రైవేట్ రంగానికి చెందిన భాగస్వామ్యులతో కలిసి పునరుద్ధరణ మరియు నిర్వహణ కోసం సిద్ధం చేస్తున్నట్లు బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ తెలిపింది. మనామాలోని ఈ పురాతన చారిత్రక కట్టడాన్ని శిథిలావస్థ నుండి తిరిగి ప్రజల ముందుకు తీసుకురావాలని ఎంపీలు కోరుతున్న నేపథ్యంలో ఈ మేరకు అథారిటీలోని హెరిటేజ్ డైరెక్టర్-జనరల్ షేక్ మహమ్మద్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా వెల్లడించారు. ఈ భవనం బహ్రెయిన్ మొట్టమొదటి హోటల్‌గా మరియు మనామాకు చారిత్రక విలువ కలిగిన ప్రాపర్టీగా, ఒక చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందిందని తెలిపారు.

ఈ హోటల్‌ను అబ్దుల్-నూర్ అల్‌బస్తాకి నిర్మించారు. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ దీనిని స్వాధీనం చేసుకునే వరకు ఇది అతని కుటుంబ యాజమాన్యంలోనే ఉంది. బహ్రెయిన్ హోటల్‌ను పునరుద్ధరించి, నిర్వహించడానికి ఒక పెట్టుబడిదారుడిని తీసుకురావాలని తాము కోరుకుంటున్నట్లు అథారిటీ 2022లో ప్రకటించింది. అప్పట్లో నిబంధనలకు అనుగుణంగా అత్యధిక బిడ్ వేసిన వారికే ఈ కాంట్రాక్టును కేటాయించారు.

ఈ హోటల్ భవనానికి గొప్ప వారసత్వ విలువ ఉందని, దీని ముఖభాగం ఒక సాంప్రదాయక శైలిని కలిగి ఉందన్నారు. ముహర్రాక్‌లోని సూక్ అల్ ఖైసరియా తరహాలో దీనిని ప్రైవేట్ రంగానికి అప్పగించి ఒక వారసత్వ భవనంగా మార్చాలని తాము ప్రతిపాదించామని తెలియజేశారు.

ఈ భవనం యొక్క వారసత్వ విలువ గురించి ఎంపీ డాక్టర్ మునీర్ సెరూర్ ప్రత్యేకంగా వివరించారు. బహ్రెయిన్ హోటల్‌ను కేవలం ఒక పాత ప్రాపర్టీగా కాకుండా.. మనామా జ్ఞాపకాలలో ఒక భాగంగా చూడాలని ఆయన అన్నారు.

 గల్ఫ్ నుండి వచ్చిన చాలా మందికి ఈ ప్రదేశం ఇప్పటికీ గుర్తుంటుందన్నారు. ఈ ప్రాంతంలో బహ్రెయిన్ ఒక తొలి వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా ఉండేదని తెలిసిన విదేశీ సందర్శకుల జ్ఞాపకాలలో కూడా దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ఆ భవనాన్ని పునరుద్ధరించి, చక్కగా నిర్వహిస్తే టూరిజానికి ప్రోత్సాహం లభిస్తుందని డాక్టర్ సెరూర్ అన్నారు.

వారసత్వ హోటల్ లేదా సాంస్కృతిక కేంద్రంతో సహా అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ రంగ భాగస్వాములతో కలిసి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికల ద్వారా తుది వినియోగాన్ని నిర్ణయిస్తామని షేక్ మహమ్మద్ అన్నారు. ఈ భవనం తిరిగి ఒక సజీవ, కార్యక్షేత్రంగా మారాలన్నదే అధికార యంత్రాంగం లక్ష్యమని ఆయన అన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com