రుతుక్రమంలో పొత్తికడుపు నొప్పికి పరిష్కారాలున్నాయ్!
- August 08, 2016
పొత్తికడుపు నొప్పికి పరిష్కారాలున్నాయ్!
రుతుక్రమం మొదలయ్యాక చాలామంది అమ్మాయిల్ని.. కొన్ని సమస్యలు ఇబ్బందిపెడతాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పొత్తికడుపు నొప్పి (డిస్మెనోరియా). దాదాపు ఎనభై శాతం అమ్మాయిల్లో కనిపించే ఈ నొప్పిని తేలిగ్గా తీసుకోవడం వల్ల ఇతర సమస్యలు ఎదురుకావచ్చు. కాబట్టి ప్రారంభదశలోనే పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలి.
నె లసరి సమయంలో పొట్టనొప్పి అనగానే చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. ఇది సహజం అనుకుంటారు. కానీ అదే కొన్నిసార్లు ప్రమాదకరంగా మారొచ్చు. పొత్తికడుపు నొప్పి కూడా అలాంటిదే. ఈ నొప్పి సాధారణంగా నెలసరికి ముందు లేదా ఆ సమయంలో బాధిస్తుంది. ఈ నొప్పి కూడా రుతుక్రమం మొదలైన వెంటనే లేదా ఒకటి రెండేళ్ల తరవాత ఎదురుకావచ్చు. పొట్ట కింది భాగంలో మొదలయ్యే ఈ నొప్పి కొన్నిసార్లు తక్కువగా ఉండొచ్చు. లేదా తీవ్రంగానూ బాధించవచ్చు.
నొప్పి తాత్కాలికమైనా...
నెలసరి సమయంలో గర్భాశయంలోని ఎండోమెట్రియం పొర బయటకు రావాలి. ఆ క్రమంలో గర్భాశయం సంకోచించాలి. కొందరిలో గర్భాశయ ముఖద్వారం గట్టిగా ఉంటుంది. దాంతో సంకోచించే గర్భాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. అలాంటప్పుడే నొప్పి మొదలవుతుంది. ఈ సమస్యే ప్రైమరీ డిస్మెనోరియా లేదా స్పాస్మోడిక్ డిస్మెనోరియా. నొప్పి నెలసరికి ముందు మొదలై రుతుస్రావం కాగానే ఆగిపోతుంది. కొందరిలో నెలసరి తరవాత ఒకటి రెండు రోజులు ఉండొచ్చు. ఇది క్రమంగా వయసు పెరిగేకొద్దీ అదుపులోకి వస్తుంది. తొలి ప్రసవమయ్యాక చాలామందిలో ఈ నొప్పి దానంతట అది తగ్గుతోంది. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు.
వైద్యుల సలహాతో: ప్రైమరీ డిస్మెనోరియాతో బాధపడేవారు కొందరు ఆ నొప్పిని తట్టుకోలేరు. సమస్య ఇబ్బందికరంగా ఉండి.. ఆ ప్రభావం దినచర్యపై పడి, చదువుకు ఆటంకం కలిగితే మాత్రం తేలిగ్గా తీసుకోకుండా వైద్యుల్ని సంప్రదించాలి. నొప్పి తీవ్రతను బట్టి వైద్యులు యాంటీ స్పాస్మోడిక్ మాత్రల్ని సూచిస్తారు. లేదంటే నెలసరి సమయంలో వెలుపలికి రావాల్సిన రక్తస్రావం వెనక్కి వెళ్లిపోతుంది. దాంతో అది ఎండోమెట్రియోసిస్కి దారి తీయొచ్చు.
దీర్ఘకాలం బాధించొచ్చు..
స్త్రీ సంతానోత్పత్తికి ఉపయోగపడే అవయవాల్లో ఏదయినా సమస్య లేదా లోపం ఉన్నప్పుడు కూడా నెలసరి సమయంలో నొప్పి ఎదురవుతుంది. ఈ పరిస్థితిని సెకెండరీ డిస్మెనోరియా లేదా కంజస్టివ్ డిస్మెనోరియా అంటారు. ఈ నొప్పి నెలసరికి నాలుగైదు రోజుల ముందు మొదలై ఐదు రోజులూ ఉంటుంది. తరవాత నెమ్మదిగా తగ్గుతుంది. కొన్నిసార్లు అలా తగ్గకుండా దీర్ఘకాలం ఇబ్బందిపెట్టొచ్చు. ఆ సమయంలో నొప్పి కూడా చాలా విపరీతంగా ఉంటుంది.
కారణాలు: గర్భశయం లోపల ఇన్ఫెక్షన్లు, ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియాసిస్, ఎడినోమయాసిస్ ఉన్నా.. ఈ సమస్య ఎదురుకావచ్చు. అంటే ఈ కారణాలతో గర్భాశయం లోపల రక్తస్రావం ఎక్కువగా నిలిచిపోతుంది. దాంతో నొప్పి మొదలవుతుంది. ఇలాంటప్పుడు నొప్పి ఓ పట్టాన తగ్గదు. చాలా అరుదుగా కొందరికి గర్భాశయం రెండు గా విచ్చుకుపోతుంది. ఇలాంటప్పుడు నొప్పి కనిపిస్తుంది.
పరీక్షలు: ఈ సమస్య ఉన్నప్పుడు వైద్యులు స్కానింగ్తోపాటూ, రక్తపరీక్షలు చేసి అసలైన కారణాన్ని తెలుసుకుంటారు. ఆ తరవాత తదనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్ లాంటివి ఉంటే గనుక లాపరోస్కోపీ లేదా హిస్టెరోస్కోపీ ద్వారా చికిత్స చేయాల్సి ఉంటుంది.
నొప్పితోపాటూ: కొన్నిసార్లు ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. దాంతో జీర్ణ సంబంధ సమస్యలూ, వికారం, వాంతులూ, విరేచనాలూ కావచ్చు. అలాంటప్పుడు అసలైన సమస్యను తగ్గించడంతోపాటూ వీటికీ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
జీవనవిధానంలో మార్పులు: నొప్పి ఏ స్థాయిలో ఉన్నా, ఒక వేళ చికిత్స తీసుకుంటున్నా నెలసరి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బరువు పెరగకుండా చూసుకోవాలి. తినే ఆహారంలో ఉప్పు, కారం, మసాలాలు, చికెన్ లాంటివి తగ్గించుకోవాలి. కెఫీన్ ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. వ్యాయామం, యోగా వంటివి చేయాలి.
తేలిగ్గా తీసుకుంటే..
ఈ పరిస్థితి ఉన్నప్పుడు హార్మోన్ల పనితీరు ముఖ్యంగా ఈస్ట్రోజెన్ సమతూకంలో ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు బరువు పెరగొచ్చు. దీన్ని గనుక నిర్లక్ష్యం చేస్తే.. మరికొన్ని సమస్యలతోపాటూ లైంగికజీవితంపైనా ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో గర్భం దాల్చలేని పరిస్థితి ఎదురవుతుంది. ఒత్తిడి పెరిగి.. మొత్తంగా హార్మోన్ల పనితీరులో తేడాలు వస్తాయి. దాంతో ఒకవేళ గర్భం దాల్చినా అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యల వల్ల చాలా అరుదుగా గర్భాశయాన్నీ తీసేయాల్సి రావచ్చు. కాబట్టి సమస్య మొదట్లో ఉన్నప్పుడే తేలిగ్గా తీసుకోకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.
ఇక్కడ మరీ ముఖ్యంగా ఒక విషయం తెలుసుకోవాలి. గర్భాశయంలో సమస్యలు ఉన్నప్పుడు అది మూత్రనాళ, మూత్రపిండాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లూ, మలబద్ధకం వంటి వాటికీ దారితీయొచ్చు. కాబట్టి అవసరాన్ని బట్టి సంబంధిత పరీక్షలు కూడా చేయించుకోవడం ముఖ్యం.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









