కోడెల పిలుపు..

- August 08, 2016 , by Maagulf
కోడెల పిలుపు..

ప్రతి ఒక్క ప్రవాసాంధ్రుడు ఏపీ కోసం ఎంతో కొంత చేయవచ్చని.. రాష్ట్రానికి చేసే సేవ కేవలం ఆర్థికపరమైనదే కానవసరంలేదని అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మిల్పిటాస్‌లోని పిస్తాహౌజ్‌లో ఎనఆర్‌ఐ తెలుగు సంఘాలు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి భిన్న కోణాల్లో సహకరించవచ్చని, మనసు పెడితే మార్గాలకు కొదవలేదని సూచించారు. ప్రవాసాంధ్రులు తమ విజ్ఞానాన్ని రాష్ట్రం కోసం వెచ్చించినా జరిగే మేలు అపారమన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా సొంత కాళ్లపై నిలిచే సత్తా తెలుగు వారికి ఉందని నిరూపించుకుందామన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అడ్డంకులను అధిగమిస్తూ నవ్యాంధ్ర రెండేళ్లలో ఎన్నో విజయాలు సాధించిందని వివరించారు. అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం సమర్థంగా సేవలు అందిస్తున్నారని, సొంత నిధుల్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారని ప్రశంసించారు. తానా- బాటా ప్రతినిధులు సతీష్‌ వేమూరి, కృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను అందించే క్రమంలో చేపట్టిన డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ పథకానికి ప్రవాసాంధ్రులు విశేషంగా స్పందించారు. కోడెల పిలుపును అందుకున్న ప్రవాసాంధ్రులు అక్కడిక్కక్కడే చెక్కులను అందజేశారు. పైలా ప్రసాద్‌ మాడుగల నియోజకర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. మిలిటాస్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌లో స్వాతంత్య్ర వేడుకలకు కోడెల.. మిలిటాస్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌లో జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో కోడెల మాట్లాడుతూ.. 4 కోట్ల మంది ప్రవాసులు దేశం వెలుపల భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో భారత కాన్సుల్‌ జనరల్‌ అశోక్‌, వెంకటేష్‌, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కోమటి జయరాం పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com