భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- June 05, 2026
న్యూ ఢిల్లీ: భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య క్రిటికల్ మినరల్స్ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం మరొక కీలక మైలురాయి చేరుకుంది. 2025లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక భేటీ సందర్భంగా క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ఏర్పాటు చేస్తామని చెప్పిన నేపథ్యంలో తాజాగా ఈ కేంద్రం ప్రారంభమైంది. గురువారం భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ (GSCO) శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి యూకే ఫారిన్ సెక్రటరీ ఇవెట్ కూపర్ గారితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, స్థిరమైన, విశ్వసనీయమైన క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ వ్యవస్థ నిర్మాణంలో ఈ అబ్జర్వేటరీ కీలక పాత్ర పోషిస్తుంది. క్లీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతికతలు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో క్రిటికల్ మినరల్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా మారుతున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ మెటీరియల్ ఫ్లో మ్యాప్ రూపకల్పనలో ఈ అబ్జర్వేటరీ ముఖ్య కేంద్రంగా నిలవనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ లక్ష్యంతోనే 4 బిలియన్ డాలర్ల జాతీయ క్రిటికల్ మినరల్స్ మిషన్‌ను ప్రారంభించాం. మినరల్స్ వెలికితీత, ఎక్స్‌ప్లొరేషన్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, ఇన్నొవేషన్స్ వంటి విషయాల్లో వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు 180 మిలియన్ డాలర్ల ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నాం.దేశవ్యాప్తంగా తొమ్మిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాల నుంచి విలువైన మినరల్స్, విదేశాల్లో మినరల్స్‌ను తవ్వడం వంటి చర్యలు చేపడుతున్నాం. మినరల్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపడుతోంది. పారదర్శకంగా ఈ-ఆక్షన్, ప్రైవేట్ కంపెనీలకు ప్రోత్సాహం అందించడంతో పాటు, జూనియర్ మైనింగ్ కంపెనీలకు అవకాశాలు కల్పిస్తోంది. వేగవంతంగా అనుమతులు అందిస్తూ.. మినరల్స్ రంగంలో పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన దేశంగా తీర్చిదిద్దుతున్నాం. బ్రిటిష్ పరిశ్రమలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ సంస్థలు భారత క్రిటికల్ మినరల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి. యూకేకు ఉన్న మినరల్ ప్రాసెసింగ్, ఎక్స్‌ట్రాక్షన్ టెక్నాలజీ భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలు, డిఫెన్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ రంగాల వేగవంతమైన అభివృద్ధికి దోహదపడుతుంది. భవిష్యత్తులో ఈ అబ్జర్వేటరీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రిటికల్ మినరల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా ఎదుగుతుంది. పరిశ్రమలు, పరిశోధకులు, పెట్టుబడిదారులకు ఈ అబ్జర్వేటరీ విలువైన సమాచారం అందిస్తుంది. కేంద్ర గనుల శాఖ, ఐఐటీ (ఐఎస్‌ఎం) ధన్‌బాద్, టెక్స్‌మిన్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని టెక్నాలజీ ట్రాన్స్‌లేషన్ రీసెర్చ్ పార్క్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో యూకే విదేశాంగ శాఖ ప్రతినిధులు, బ్రిటిష్ హై కమిషన్ అధికారులు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు, ఐఐటీ (ఐఎస్‌ఎం) ధన్‌బాద్, టెక్స్‌మిన్, కేంద్ర గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







