ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాద బాధితులకు Dh1 మిలియన్ సాయం ప్రకటించిన యూఏఈ బిలియనీర్
- June 10, 2026
దుబాయ్: ఇటీవల ఎమిరేట్స్ రోడ్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన బాధితులకు యూఏఈ బిలియనీర్ మరియు బుర్జీల్ హోల్డింగ్స్ చైర్మన్ డాక్టర్ షంషీర్ వయలిల్ Dh1 మిలియన్ (సుమారు రూ.2.3 కోట్లు) విలువైన మానవతా సహాయ ప్యాకేజీని ప్రకటించారు.
ఈ ప్రమాదంలో కార్మికులను తీసుకెళ్తున్న మినీబస్సు, సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు.
ప్రకటించిన సహాయ ప్యాకేజీ ప్రకారం, మృతి చెందిన ఏడుగురు కార్మికుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి Dh100,000 చొప్పున, మొత్తం Dh700,000 అందజేయనున్నారు. అలాగే గాయపడిన తొమ్మిది మంది చికిత్స, కోలుకునేందుకు Dh180,000 కేటాయించారు.
అదనంగా, బాధితుల కుటుంబ సభ్యుల అత్యవసర ప్రయాణం, వసతి ఖర్చుల కోసం Dh70,000, అలాగే ప్రభావిత కుటుంబాలకు చెందిన పిల్లల విద్యాభ్యాసం కోసం Dh50,000 ప్రత్యేకంగా కేటాయించారు.
ఈ సందర్భంగా డాక్టర్ షంషీర్ మాట్లాడుతూ, “ఇది అనేక కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టిన హృదయ విదారక ఘటన. ఉపాధి కోసం, తమ కుటుంబాల భవిష్యత్తు కోసం యూఏఈకి వచ్చిన కార్మికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. ఆ ప్రాణ నష్టాన్ని ఏ ఆర్థిక సాయం భర్తీ చేయలేకపోయినా, ఈ సహాయం బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.
ప్రమాదంలో మరణించిన వారిలో ఆరుగురు భారతీయులు, ఒకరు శ్రీలంక పౌరుడు ఉన్నారు. భారతీయుల్లో ముగ్గురు ఉత్తరప్రదేశ్, మరో ముగ్గురు తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారని సమాచారం. గాయపడిన వారిలో కొందరు ఇప్పటికే ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, మరికొందరు యూఏఈలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని దుబాయ్ పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ప్రమాద బాధితులకు అందించే సహాయం జాతీయతతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుందని డాక్టర్ షంషీర్ స్పష్టం చేశారు.
భారతీయ బాధితుల కుటుంబాలకు సంబంధించి దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌తో సమన్వయం కొనసాగుతున్నప్పటికీ, ఈ విషాద ఘటన వల్ల ప్రభావితమైన ప్రతి కుటుంబానికి మానవతా దృక్పథంతో సహాయం అందజేస్తామని ఆయన తెలిపారు.
ఈ సహాయ కార్యక్రమం ద్వారా బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక ఉపశమనం కల్పించడంతో పాటు, ప్రధాన ఆదాయ వనరును కోల్పోయిన కుటుంబాల పిల్లల భవిష్యత్తును కూడా రక్షించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







