అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- June 12, 2026
అబుధాబి: అబుధాబికి ఎతిహాద్ ఎయిర్‌వేస్ ద్వారా వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. అబుధాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ (DCT Abu Dhabi), నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ–దమాన్ భాగస్వామ్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
ఈ పథకం 2026 జూలై నుంచి డిసెంబర్ వరకు అమల్లో ఉండనుంది. అర్హులైన సందర్శకులకు యూఏఈలో గరిష్టంగా 15 రోజుల పాటు వైద్య బీమా రక్షణ లభిస్తుంది.
ఎతిహాద్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ బీమా పొందేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అర్హత కలిగిన ప్రతి ఎతిహాద్ టికెట్‌తో బీమా స్వయంచాలకంగా అందుబాటులోకి వస్తుంది. యూఏఈ వెలుపల నుంచి టికెట్ కొనుగోలు చేసి, ఎతిహాద్ నిర్వహించే విమానాల్లో అబుధాబికి ప్రయాణించే వారందరూ ఈ సదుపాయానికి అర్హులు.
అలాగే, ఎతిహాద్ ఉచిత స్టాప్‌ఓవర్ ప్రోగ్రామ్ ద్వారా అబుధాబిలో కొంతకాలం బస చేసే ప్రయాణికులకు కూడా వారి బస వ్యవధి మొత్తం బీమా వర్తించనుంది.
సందర్శకులకు మరింత భరోసా
ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికులపై పరిపాలనా భారం తగ్గడంతో పాటు, అబుధాబి సందర్శనను మరింత సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యమని ఎతిహాద్ పేర్కొంది.
ఎతిహాద్ ఎయిర్‌వేస్ సీఈఓ ఆంటోనాల్డో నేవ్స్ మాట్లాడుతూ, “అబుధాబికి చేరుకోవడం, అక్కడ గడపడం రెండింటినీ వీలైనంత సులభతరం చేయడం మా లక్ష్యం. ప్రతి అర్హత కలిగిన టికెట్‌తో సమగ్ర వైద్య బీమా అందించడం ద్వారా ప్రయాణికులు అబుధాబి ఆతిథ్యాన్ని ఎలాంటి ఆందోళన లేకుండా ఆస్వాదించగలరు” అని తెలిపారు.
పర్యాటక రంగానికి ఊతం
డీసీటీ అబుధాబి పర్యాటక విభాగం డైరెక్టర్ జనరల్ సలేహ్ మహమ్మద్ అల్ గెజిరీ మాట్లాడుతూ, అబుధాబి పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సందర్శకులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించగలమని చెప్పారు.
దమాన్ సీఈఓ ఖాలెద్ అతీక్ అల్ దహెరి మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యం, సంక్షేమ పరిరక్షణ మా ప్రధాన బాధ్యత. ప్రయాణంలోనే వైద్య బీమాను భాగం చేయడం ద్వారా సందర్శకులకు మరింత భద్రత, విశ్వాసం కల్పించగలుగుతున్నాం” అని తెలిపారు.
ఈ కొత్త కార్యక్రమంతో అబుధాబి పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు, అంతర్జాతీయ సందర్శకులకు అదనపు భద్రతా హామీ లభించనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







