విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!

- June 12, 2026 , by Maagulf
విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!

న్యూ ఢిల్లీ: దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపులు (Fake Bomb Threats) రావడం ఈ మధ్యకాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శంషాబాద్ (హైదరాబాద్), దిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై ఎయిర్‌పోర్టులకు తరచూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వస్తున్న ఫేక్ మెయిల్స్, ఫోన్ కాల్స్ వల్ల భద్రతా దళాలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అల్లరి మూకల చర్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ (Ministry of Civil Aviation) అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇలాంటి ఫేక్ బెదిరింపులకు పాల్పడే వారిపై విమాన ప్రయాణాల నుంచి జీవితకాల నిషేధం (Lifetime Ban) విధించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగిందంటే?
ఇటీవల మే 21, 2026న ఉదయం 8 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సపోర్ట్ మెయిల్‌కు వరుసగా 3 మెసేజ్‌లు వచ్చాయి. ఫలానా విమానాల్లో బాంబులు ఉన్నాయని, ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆ మెయిల్స్ సారాంశం. దీంతో ఎయిర్‌పోర్ట్‌లోని బాంబ్ థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ (BTAC) హుటాహుటిన రంగంలోకి దిగి, ఆ విమానాలను రన్‌వేకు దూరంగా తరలించి తనిఖీలు చేసింది. చివరకు అది ఫేక్ కాల్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఫిబ్రవరి నుంచి మే నెలల మధ్యే దేశవ్యాప్తంగా 32 నకిలీ బెదిరింపులు వచ్చాయి.

రూ. కోటి వరకు జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష!
నిరంతరం పెరుగుతున్న ఈ ముప్పును అరికట్టడానికి అధికారులు ఎయిర్‌క్రాఫ్ట్ (సెక్యూరిటీ) చట్టం, 2023 లోని కొన్ని కీలక నిబంధనలను సవరించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతితో త్వరలోనే అమలు కానున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం..తప్పుడు బాంబు సమాచారం ఇచ్చే నిందితులకు ఘటన తీవ్రతను బట్టి రూ.1 లక్ష నుండి రూ.1 కోటి వరకు భారీ జరిమానా విధిస్తారు. జరిమానాతో పాటు గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడేలా చట్టాన్ని కఠినతరం చేశారు.

సరదా కోసం.. లేట్ అవుతుందనే వింత కారణాలు!
ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసులు జరిపిన విచారణలో దాదాపు 80 శాతం మంది కేవలం వ్యక్తిగత అవసరాల కోసమో లేదా సరదా కోసమో ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నట్లు తేలింది. పోలీసులు పట్టుకున్న కొందరు నిందితుల వింత కారణాలు అధికారులనే ఆశ్చర్యపరిచాయి. తాను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం ఆలస్యం అవుతుందేమోనని, బాంబు బెదిరింపు వస్తే విమానం ఆగుతుందనే వింత ఆలోచనతో ఒక నిందితుడు ఏప్రిల్ 8న ఈమెయిల్ పంపాడు. గతంలో ఒకసారి తాను 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది చెక్-ఇన్ మూసేశారు. ఆ కక్షతో బెంగళూరు వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ ఒకరు ఫోన్ చేశారు. విమానం ఆగిపోతే ఎలా ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతో ఒక 13 ఏళ్ల బాలుడు సరదాగా బెదిరింపు మెయిల్ పంపినట్లు విచారణలో తేలింది. ఇలాంటి నకిలీ కాల్స్ వల్ల సెక్యూరిటీ క్లియరెన్స్ పూర్తయ్యే వరకు విమానాలను నిలిపివేయాల్సి వస్తోంది. దీనివల్ల విమానయాన సంస్థల (Airlines) విలువైన సమయం వృథా అవ్వడమే కాకుండా, కోట్లాది రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. కేంద్రం తీసుకోబోయే ఈ తాజా ‘జీవితకాల నిషేధ’ నిర్ణయం మరియు భారీ జరిమానాలు ఇలాంటి అల్లరి మూకల ఆటలు కట్టడి చేయడానికి ఎంతగానో దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com