వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన

- June 13, 2026 , by Maagulf
వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సోషల్ మీడియాలో జరుగుతున్న ముమ్మర ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఉద్యోగ నియామకాల షెడ్యూల్ పూర్తిగా నకిలీదని, దానికి కమిషన్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగార్థులు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.

నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం

గత రెండు రోజులుగా ఏపీపీఎస్సీ పేరుతో కొన్ని నకిలీ నోటిఫికేషన్ల వివరాలు, పరీక్షల షెడ్యూల్స్, అధికారిక పత్రాల తరహాలో ఉన్న డాక్యుమెంట్లు వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించిన కమిషన్… పరీక్షలు, ఫలితాలు, ఎంపికల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అనధికారిక సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. అంతేకాకుండా, ఇలాంటి అవాస్తవాలను ఇతరులకు షేర్ లేదా ఫార్వార్డ్ చేయవద్దని కోరింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం కోసం కేవలం కమిషన్ అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది.

APPSC: ఉగాది జాబ్ క్యాలెండర్‌కు, వీటికి సంబంధం లేదు

నిజానికి, ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టుల భర్తీ కోసం అధికారిక జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. అందులో నోటిఫికేషన్ల తేదీలు, పోస్టుల వివరాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పోస్టులన్నింటినీ నిర్దేశిత సమయంలోనే పారదర్శకంగా భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ కూడా గతంలో హామీ ఇచ్చారు. అయితే, ఈ అధికారిక క్యాలెండర్‌తో సంబంధం లేకుండా కొందరు ఆకతాయిలు నకిలీ షెడ్యూల్స్ సృష్టించి అభ్యర్థుల్లో గందరగోళం రేపుతున్నారని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com