యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

- June 18, 2026 , by Maagulf
యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

24 మంది నిందితుల గుర్తింపు.. భారీగా మాదకద్రవ్యాల స్వాధీనం

అబుదాబి: యూఏఈలో మాదకద్రవ్యాల పంపిణీకి కుట్ర పన్నిన అంతర్జాతీయ నేర ముఠాను యూఏఈ యాంటీ-నార్కోటిక్స్ అధికారులు భగ్నం చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 24 మంది నిందితులను గుర్తించి పలువురిని అరెస్టు చేయడంతో పాటు భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఫెడరల్ నార్కోటిక్స్ కంట్రోల్ ప్రాసిక్యూషన్ నుంచి అందిన సమాచారంతో రాస్ అల్ ఖైమా పోలీసుల సహకారంతో ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

దర్యాప్తు వివరాల ప్రకారం, ఒక ఎమిరేట్‌లోని రహస్య ప్రదేశంలో మాదకద్రవ్యాలు దాచిపెట్టినట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. అవసరమైన న్యాయ అనుమతులు పొందిన అనంతరం నిర్వహించిన ఆపరేషన్‌లో డ్రగ్స్‌ను తరలిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు చేశారు.

విచారణలో నిందితులు విదేశాల్లో ఉన్న ఓ ప్రధాన సూత్రధారి ఆదేశాల మేరకు యూఏఈలో డ్రగ్స్ పంపిణీ చేస్తున్నట్లు అంగీకరించారు. దీంతో అధికారులు విస్తృత స్థాయిలో నిఘా కొనసాగించి, ముఠా నాయకుడితో సంబంధం ఉన్న మరో 11 మంది అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం దుబాయ్, అబుదాబి, అజ్మాన్ ఎమిరేట్లలో నిర్వహించిన దాడుల్లో మరో 10 మంది నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి వివిధ రకాల మాదకద్రవ్యాలు, మానసిక ప్రభావం కలిగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో భాగంగా అధికారులు మరో రహస్య నిల్వ కేంద్రాన్ని గుర్తించారు. అక్కడ భారీ మొత్తంలో గంజాయి, హషీష్ ఆయిల్, సింథటిక్ కానాబినాయిడ్‌తో తయారుచేసిన కాగితాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు దర్యాప్తు కోసం ఫెడరల్ నార్కోటిక్స్ ప్రాసిక్యూషన్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అరెస్టు చేసిన నిందితులను, స్వాధీనం చేసుకున్న పదార్థాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం సంబంధిత ప్రయోగశాలకు పంపించినట్లు అధికారులు తెలిపారు.

యూఏఈలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పంపిణీపై కఠిన చర్యలు కొనసాగుతాయని, దేశ భద్రతకు ముప్పుగా మారే నేర కార్యకలాపాలను ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com