పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- June 19, 2026
పాస్‌పోర్ట్ సేవా దివస్-2026లో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ ధృవీకరణ సేవల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు తెలంగాణ పోలీసులకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక "ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు ఫర్ స్టేట్ పోలీస్"ను ప్రదానం చేసింది. పాస్‌పోర్ట్ సేవా దివస్-2026 సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ చేతుల మీదుగా ఈ అవార్డును తెలంగాణ పోలీసుల తరఫున డీజీపీ సి.వి.ఆనంద్ స్వీకరించారు.
పాస్‌పోర్ట్ ధృవీకరణ సేవల నిర్వహణలో తెలంగాణ పోలీసుల అత్యుత్తమ పనితీరును గుర్తిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ గౌరవాన్ని అందించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ పోలీసు శాఖ ఆదర్శంగా నిలుస్తోందని ఈ సందర్భంగా పేర్కొంది.
గణాంకాల్లో తెలంగాణ పోలీసుల ప్రతిభ
2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ పోలీసులకు మొత్తం 8,67,741 పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అభ్యర్థనలు అందగా, వాటిలో 8,67,452 దరఖాస్తులను వేగంగా పరిశీలించి పూర్తి చేశారు. సగటున ఏడు రోజులలోపే ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడం తెలంగాణ పోలీసుల ప్రత్యేకతగా నిలిచింది.
అలాగే 2014 నుంచి ఇప్పటివరకు పాస్‌పోర్ట్ సేవల విభాగంలో తెలంగాణ పోలీసులకు లభించిన ఏడో జాతీయ స్థాయి అవార్డు కావడం విశేషం.
విజయానికి వెనుక "వెరిఫాస్ట్" సాంకేతికత
ఈ విజయానికి ప్రధాన కారణంగా "వెరిఫాస్ట్" సాఫ్ట్‌వేర్ నిలిచింది. 2014లో అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్, ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సి.వి. ఆనంద్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ను అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు.
తెలంగాణ పోలీసులే స్వయంగా రూపొందించిన ఈ ఏఐ ఆధారిత ప్లాట్‌ఫారమ్, దరఖాస్తుదారుల వివరాలను సీసీటీఎన్‌ఎస్ (CCTNS), గత పాస్‌పోర్ట్ రికార్డులు, నేర చరిత్ర డేటాబేస్‌లతో అనుసంధానం చేసి వేగవంతమైన, ఖచ్చితమైన ధృవీకరణకు సహకరిస్తోంది. అలాగే అవకతవకలను గుర్తించి పారదర్శక సేవలను అందిస్తోంది.
ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండగా, దరఖాస్తుదారులకు ప్రతి దశలో సమాచారం అందించే సదుపాయం కల్పిస్తోంది. త్వరలో స్లాట్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఫీల్డ్ అధికారుల కృషికే గుర్తింపు
ఈ అవార్డు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది కృషికి దక్కిన గుర్తింపని అధికారులు పేర్కొన్నారు. వేగవంతమైన, పారదర్శకమైన, ప్రజాకేంద్రీకృత పాస్‌పోర్ట్ ధృవీకరణ సేవలను అందించడంలో వారి అంకితభావమే ఈ విజయానికి కారణమని తెలిపారు.
ప్రజా సేవల అందజేతలో తెలంగాణ పోలీసులు ఎప్పటికప్పుడు కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారని, ఈ అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







