అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- November 07, 2026
దోహా: అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలకు సంబంధించి ఖతార్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న వార్తలను ఖతార్ అంతర్జాతీయ మీడియా కార్యాలయం (IMO-Qatar) ఖండించింది. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయని ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి చేసినట్లు ఆన్‌లైన్‌లో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని స్పష్టం చేసింది.
ప్రాంతంలో యుద్ధం, అస్థిరత కొనసాగాలని కోరుకునే కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నాయని IMO పేర్కొంది. దౌత్య ప్రయత్నాలను దెబ్బతీసి, ఉద్రిక్తతలను మరింత పెంచేందుకు నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఇలాంటి ప్రచారం జరుగుతోందని తెలిపింది. ఇది బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణించింది. వాస్తవానికి అమెరికా, ఇరాన్ రెండూ ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయని ఖతార్ ప్రధాని స్పష్టం చేసినట్లు మీడియా కార్యాలయం వెల్లడించింది.
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, ప్రధానమంత్రి సలహాదారు డాక్టర్ మాజిద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ కూడా ఈ విషయంపై స్పందించారు. ప్రధాని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఎక్స్ (X) వేదికగా షేర్ చేస్తూ, ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకునేందుకు కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించారు.
ఈ సున్నితమైన సమయంలో ప్రజాభిప్రాయాన్ని తప్పుదోవ పట్టిస్తూ, దౌత్య ప్రయత్నాలను బలహీనపరిచే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. అమెరికా, ఇరాన్‌తో ఖతార్ మధ్యవర్తులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు ఫలవంతం కావడానికి అవసరమైన సహకారం అందిస్తున్నారని అల్ అన్సారీ వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఊరట..!!
- దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!







