షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- July 01, 2026
షార్జా: షార్జా మున్సిపాలిటీ ప్రజా పార్కింగ్ సేవల నిర్వహణ సమయాలను పొడిగించింది. జూలై 1 నుంచి షార్జా సిటీ, కల్బా, ఖోర్‌ఫక్కాన్, అల్ ధైద్ ప్రాంతాల్లోని అన్ని చెల్లింపు పార్కింగ్ జోన్లలో అర్ధరాత్రి (12 గంటల) వరకు పార్కింగ్ ఫీ అమల్లో ఉంటుందని ప్రకటించింది.
ఇప్పటి వరకు పసుపు (Yellow) బోర్డులు ఉన్న పార్కింగ్ జోన్లలో చెల్లింపు సమయాలు తక్కువగా ఉండగా, కొత్త నిర్ణయంతో వాటిని నీలం (Blue) బోర్డులు ఉన్న జోన్ల సమయాలకు సమానంగా మార్చారు. దీంతో అన్ని చెల్లింపు పార్కింగ్ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, ప్రస్తుత విధానం ప్రకారం శుక్రవారాలు మరియు అధికారిక ప్రభుత్వ సెలవు రోజుల్లో సాధారణ పార్కింగ్ ఉచితంగానే కొనసాగుతుంది. అయితే వారంలో ఏడు రోజులూ రుసుము వసూలు చేసే ప్రత్యేక పార్కింగ్ జోన్లకు ఈ మినహాయింపు వర్తించదు.
షార్జా మున్సిపాలిటీ ప్రజా పార్కింగ్ విభాగం డైరెక్టర్ హమీద్ అల్ ఖైద్ మాట్లాడుతూ, ఎమిరేట్‌లో వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పర్యాటక రంగ అభివృద్ధి కారణంగా పార్కింగ్ అవసరాలు పెరిగాయని తెలిపారు. ప్రజల అవసరాలు, పార్కింగ్ వినియోగం, డిమాండ్, నివాసితులు, సందర్శకుల అభిప్రాయాలను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం షార్జాలో సుమారు 1.24 లక్షల చెల్లింపు పార్కింగ్ స్థలాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. రాత్రి 10 గంటల తర్వాత ముఖ్యంగా రెస్టారెంట్లు, కేఫ్‌లకు వచ్చే వారికి, సీజనల్ పార్కింగ్ పాస్ కలిగిన వారికి పార్కింగ్ లభించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ మార్పు తీసుకువచ్చినట్లు వివరించారు.
ఈ నిర్ణయం వల్ల వాణిజ్య, నివాస ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాల వినియోగం మెరుగుపడటంతో పాటు అక్రమ పార్కింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని, వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయని మున్సిపాలిటీ పేర్కొంది. పర్యాటకులు, నివాసితులకు మెరుగైన సేవలు అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది.
అలాగే, పార్కింగ్ సమయాలను పొడిగించినప్పటికీ సీజనల్ పార్కింగ్ సబ్‌స్క్రిప్షన్ రుసుముల్లో ఎలాంటి పెంపు ఉండదని మున్సిపాలిటీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, సబ్‌స్క్రిప్షన్ కలిగిన వారికి రోజువారీ మినహాయింపు సమయం 14 గంటల నుంచి 16 గంటలకు పెరుగుతుందని తెలిపింది.
ప్రజలు నిర్ణీత పార్కింగ్ సమయాలను పాటించాలని, SMS సేవ, డిజిటల్ షార్జా యాప్ లేదా ఇతర అధికారిక చెల్లింపు మార్గాల ద్వారా పార్కింగ్ రుసుము చెల్లించాలని షార్జా మున్సిపాలిటీ సూచించింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్‌ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్‌ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







