రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక

- July 05, 2026 , by Maagulf
రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక

దుబాయ్: వాహనం చెడిపోవడం, ఇంధనం అయిపోవడం లేదా టైరు పంక్చర్ కావడం వంటి కారణాలతో రహదారి మధ్యలో వాహనాలను నిలిపివేయడం అత్యంత ప్రమాదకరమని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ప్రయాణానికి ముందు వాహనం రోడ్డు ప్రయాణానికి అనుకూల స్థితిలో ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని వాహనదారులకు సూచించారు.

ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం రహదారి మధ్యలో వాహనాన్ని నిలిపితే AED 1,000 జరిమానాతో పాటు ఆరు ట్రాఫిక్ బ్లాక్ పాయింట్లు విధిస్తారు. అదనంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు ఆర్టికల్ 98 ప్రకారం AED 500 జరిమానా కూడా విధించబడుతుంది.

దుబాయ్ పోలీసు ట్రాఫిక్ విభాగం తాత్కాలిక డైరెక్టర్ బ్రిగేడియర్ ఇస్సామ్ ఇబ్రహీం అల్ అవర్ మాట్లాడుతూ, రహదారి మధ్యలో వాహనాన్ని నిలిపివేయడం వల్ల తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం, తీవ్ర గాయాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు. వాహనం రోడ్డుపైనే నిలిచిపోయి తరలించే పరిస్థితి లేకపోతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని భద్రపరచడంతో పాటు ఇతర ప్రయాణికుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

ఇటీవల జెబెల్ అలీ రోడ్డులో సాంకేతిక లోపంతో ఒక బస్సు రహదారి మధ్యలో ఆగిపోవడంతో, వెనుక నుంచి వచ్చిన ఒక కారు, మరో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 25 మంది గాయపడిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ చేశారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, అప్రమత్తత లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ట్రాఫిక్ ప్రమాదాల దర్యాప్తు నిపుణులను సంఘటనా స్థలానికి పంపి ప్రమాదానికి గల కారణాలను సేకరించిందని బ్రిగేడియర్ అల్ అవర్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రించి, సహాయక బృందాలు సులభంగా చేరుకునేలా చర్యలు తీసుకున్నారని, అనంతరం దెబ్బతిన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకువచ్చినట్లు చెప్పారు.

వాహనం చెడిపోయినా లేదా ప్రమాదానికి గురైనా రోడ్డుపై నుంచి తొలగించలేని పరిస్థితి ఉంటే డ్రైవర్లు వెంటనే హెజార్డ్ వార్నింగ్ లైట్లు ఆన్ చేయాలి, ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించాలి, వీలైతే వాహనం వెనుక తగిన దూరంలో వార్నింగ్ ట్రయాంగిల్ ఏర్పాటు చేయాలి. అనంతరం రహదారికి దూరంగా సురక్షిత ప్రదేశానికి వెళ్లి పోలీసులను సంప్రదించాలని దుబాయ్ పోలీసులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com