NATS మేరీల్యాండ్ ఆన్‌లైన్ ఆర్ట్ వర్క్‌షాప్ కు మంచి స్పందన

- July 05, 2026 , by Maagulf
NATS  మేరీల్యాండ్ ఆన్‌లైన్ ఆర్ట్ వర్క్‌షాప్ కు మంచి స్పందన

మేరీల్యాండ్: తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యంగా ఉచిత ఆన్‌లైన్ ఆర్ట్ వర్క్  నిర్వహించింది.‘నాట్స్’ మేరీల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉచిత ఆన్‌లైన్ ఆర్ట్ వర్క్‌షాప్‌ కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
చెన్నైకి చెందిన ప్రముఖ చిత్రకారుడు గోపీకృష్ణ మూర్తి ఈ వర్క్‌షాప్‌లో చిత్రకళపై శిక్షణ ఇచ్చారు. కళారంగంలో 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, అనేక పురస్కారాలు అందుకున్న గోపీకృష్ణ, పెన్సిల్ డ్రాయింగ్‌లోని మెళకువలను ఎంతో సులభంగా, దశలవారీగా వివరించారు. ఆయన బోధనా శైలి పట్ల ఈ శిక్షణలో పాల్గొన్న వారు హర్షం వ్యక్తం చేశారు.

అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కళాభిమానులు ఈ వర్క్‌షాప్‌లో భాగస్వాములయ్యారు.ముఖ్యంగా 5 నుండి 13 సంవత్సరాల వయస్సు గల సుమారు 30 మంది చిన్నారులు పెన్సిల్ డ్రాయింగ్‌లో ప్రాథమికాంశాలను ఉత్సాహంగా నేర్చుకున్నారు.పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఆసక్తిగా డ్రాయింగ్స్ వేసి, తాము గీసిన చిత్రాలను చూసి మురిసిపోయారు. ఈ తరగతులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడమే కాకుండా, భవిష్యత్తులో కూడా కళాత్మక విద్యను కొనసాగించాలనే స్ఫూర్తిని నింపాయి.

ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో నాట్స్ మేరీల్యాండ్ చాప్టర్ సభ్యులు వాకుల్ మోరే, విశ్వ మార్ని, హారిణి నర్ల ,సువర్ణ కీలక పాత్ర పోషించారు.కుటుంబాలకు ఉపయోగకరమైన, విజ్ఞానదాయకమైన కార్యక్రమాలను అందించడంలో తమ వంతు కృషి చేస్తూ, పిల్లల్లోని దాగి ఉన్న సృజనాత్మకతకు ఈ వర్క్‌షాప్ వేదికగా నిలిచింది. చిత్ర కళా శిక్షణను తెలుగువారికి అందించడంలో కృషి చేసిన నాట్స్ మేరీ ల్యాండ్ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ప్రత్యేకంగా అభినందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com