మెల్‌బోర్న్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- July 09, 2026
మెల్‌బోర్న్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరానికి చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లిన పీఎం మోదీకి విమానాశ్రయంలో, అలాగే ఆయన బస చేసిన హోటల్ వద్ద ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పట్టారు. ప్రధానిని ఒక్కసారైనా చూడాలని వందలాది మంది భారతీయులు గంటల తరబడి నిరీక్షించారు. మోదీ రాకతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. “భారత్ మాతా కీ జై”, “మోదీ-మోదీ” నినాదాలతో మెల్‌బోర్న్ వీధులు హోరెత్తాయి.
దేశభక్తి గీతాలు.. శివతాండవ నృత్యాలు
భారతీయ కళాకారులు ‘మా తుఝే సలామ్’, ‘వందేమాతరం’ వంటి దేశభక్తి గీతాల ఆలపనతో ప్రధానికి స్వాగతం పలికారు. ప్రవాస భారతీయుల దేశభక్తికి ప్రధాని మోదీ ముగ్ధులయ్యారు. ముఖ్యంగా మహిళా కళాకారులు భక్తిభావంతో ప్రదర్శించిన శివ భక్తి నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారుల ప్రతిభను చూసి ఆనందించిన ప్రధాని, చప్పట్లు కొడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రదర్శన ముగిసిన అనంతరం వారందరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.
PM Modi Australia Visit: ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్
ఈ పర్యటనపై ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ‘‘నేను మెల్‌బోర్న్ చేరుకున్నాను. ఈ పర్యటన భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉన్న వ్యూహాత్మక బంధాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని నమ్ముతున్నాను. ప్రధాని అల్బనీస్‌తో జరగబోయే ద్వైపాక్షిక చర్చల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాల సంబంధాలకు వెన్నెముకగా నిలుస్తున్న భారతీయ సమాజంతో (డయాస్పోరా) సంభాషించేందుకు ఉత్సాహంగా ఉన్నాను” అని పేర్కొన్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ పర్యటన వివరాలను వెల్లడిస్తూ.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి ప్రధాని మోదీ 3వ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు సహ-అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు పలువురు గ్లోబల్ సీఈఓలతో ప్రధాని సమావేశం కానున్నట్లు చెప్పారు.
చైనాకు చెక్ పెట్టేలా రక్షణ, ఖనిజ ఒప్పందాలు!
మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ సామ్ మోస్టిన్‌తో పాటు పలువురు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. ముఖ్యంగా రక్షణ రంగ సహకారంతో పాటు, భారత్‌కు అత్యంత కీలకమైన యురేనియం, రేర్ ఎర్త్ మెటీరియల్స్ (అరుదైన ఖనిజాలు) సరఫరాపై ఇరుదేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా విస్తరణవాదానికి, దూకుడుకు బ్రేక్ వేసేందుకు భారత్-ఆస్ట్రేలియాల మధ్య బలపడుతున్న ఈ రక్షణ, దౌత్య సంబంధాలు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్‌బోర్న్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







