ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!

- July 09, 2026 , by Maagulf
ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!

జెనీవా: ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వెస్ట్) నిర్వహణకు సంబంధించి తాము చేపట్టిన గ్లోబల్ నియంత్రణ కార్యక్రమం విజయవంతంగా అమలైందని సౌదీ అరేబియా ప్రకటించింది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) భాగస్వామ్యంతో పరాగ్వే, రువాండా, జాంబియా దేశాల్లో జాతీయ ఈ-వ్యర్థాల నిర్వహణ విధానాలను రూపొందించినట్లు వెల్లడించింది. 190కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్న వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ (WSIS) సదస్సు సందర్భంగా జెనీవాలో ఈ ప్రకటన చేశారు. డిజిటల్ సుస్థిరతను ప్రోత్సహించడం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ (Circular Economy)కు అనుగుణంగా ఈ-వ్యర్థాల నిర్వహణకు నియంత్రణ వ్యవస్థలను రూపొందించడం, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించే వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సౌదీ తెలిపింది.

ఈ ప్రాజెక్టు ద్వారా మూడు దేశాలకు ప్రత్యేక జాతీయ ఈ-వ్యర్థాల నిర్వహణ నియంత్రణ విధానాలు రూపొందించడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలు, నియంత్రణ నమూనాలపై ప్రత్యేక మార్గదర్శకాన్ని సిద్ధం చేశారు. అలాగే అమలు వ్యయాల అంచనా, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారుల విస్తృత బాధ్యత (Extended Producer Responsibility–EPR) కింద విధించే రుసుములపై అధ్యయనాలు కూడా చేపట్టారు.ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 270కిపైగా సంస్థలు, 480 మందికిపైగా నిపుణులు భాగస్వాములయ్యారు.

1949లో ఐటీయూలో సభ్యత్వం పొందినప్పటి నుంచి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్‌కు సౌదీ నిరంతరం సహకారం అందిస్తోందని, డిజిటల్ నియంత్రణ, కృత్రిమ మేధ (AI), అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, జ్ఞాన బదిలీ, వృత్తాకార ఆర్థిక వ్యవస్థలను ప్రోత్సహించడంలో తమ కట్టుబాటుకు ఈ ప్రాజెక్టు నిదర్శనమని పేర్కొంది. సౌదీ కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST), ఐటీయూ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేశాయి. 2023 జూన్‌లో ఈజిప్ట్‌లోని షార్మ్ ఎల్-షేక్‌లో జరిగిన గ్లోబల్ సింపోజియం ఫర్ రెగ్యులేటర్స్ సందర్భంగా ఒప్పందం కుదిరగా, అదే ఏడాది నవంబర్‌లో దుబాయ్‌లో జరిగిన ఐరాస వాతావరణ సదస్సు (COP28)లో అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమం ద్వారా పరాగ్వే, రువాండా, జాంబియాల్లో ఈ-వ్యర్థాల నిర్వహణకు జాతీయ చట్టాలు, అమలు విధానాలు రూపొందించడమే కాకుండా, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచడం, సుస్థిర డిజిటల్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఈ తరహా సహకారం కోసం మరిన్ని దేశాలు కూడా ఐటీయూను సంప్రదిస్తున్నాయని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com