ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- July 09, 2026
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ పై అమెరికా మరో విడత దాడులకు పాల్పడింది. ఇరాన్‌పై భీకర దాడులతో విరుచుకుపడతామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.
చాబహార్, బందర్, అబ్బాస్, కొనారక్, ఇరాన్ షహర్ సహా దక్షిణ ఇరాన్ లోని పలు కీలక ప్రాంతాల్లో భారీ పేల్లుళ్లు సంభవించగా.. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్ దళాలు సైతం గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఖతార్ లలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేశాయి. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
మంగళవారం హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ ప్రకటించారు. టర్కీలో జరిగిన నాటో సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. “ఇరాన్‌తో శాశ్వత ఒప్పందం కుదిరినా అది నిలుస్తుందనే నమ్మకం లేదు. వాళ్లు విశ్వసనీయులు కాదు. నా దృష్టిలో తాత్కాలిక ఒప్పందం ఇప్పటికే ముగిసింది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పూర్తి స్థాయి యుద్ధం మళ్లీ ప్రారంభమవుతుందని మాత్రం తాను భావించడం లేదని కూడా చెప్పారు.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ దాడులు ప్రారంభంకావడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు హర్మూజ్ జలసంధి గుండా వెళ్తుంది. ఈ వ్యూహాత్మక మార్గంపై ప్రభావం చూపగల సామర్థ్యం ఇరాన్ కు ఉండటంతో అంతర్జాతీయంగా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది.
తాజా దాడులతో ఇరుదేశాల మధ్య శాంతిచర్చలకు అవకాశం లేకుండా పోయే అవకాశం ఉంది. మరోవైపు.. తాజా దాడుల ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు వెంటనే స్పందించాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక దశలో సుమారు 7శాతం వరకు ఎగసిపడగా.. తరువాత బ్యారెల్ కు సుమారు 70డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత దిగజారితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఐక్యరాజ్యసమితి సహా పలుదేశాలు ఇరు పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశాయి. పరిస్థితి మరింత దిగజారితే మధ్యప్రాచ్య భద్రతతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







