రావుగోపాలరావు వర్థంతి నేడు
- August 12, 2016
రావు గోపాలరావు.. నట విశ్వరూపంతో విలనిజానికే వన్నె తెచ్చిన లెజెండరీ నటుడు. విలనిజానికి వినోదాన్ని జోడించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఘనుడు. నటనకే పరిమితం కాకుండా ఆపదలో ఉన్న ఆర్తులను ఆదుకునే విశాల హృదయుడిగా ప్రజల మదిలో నిలిచిన రావుగోపాలరావు వర్థంతి నేడు (శనివారం). ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు 'నవచిత్రం' పాఠకులకు ప్రత్యేకం..లెజెండరీ నటుడిగా పేరు తెచ్చుకున్న రావుగోపాలరావు 1937 జనవరి 14న కాకినాడ సమీపంలోని గంగనపల్లి గ్రామంలో జన్మించారు. మొదట బొమ్మలు గీసే ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేశారు. సాహిత్యంపై మక్కువతో పుస్తక ప్రియుడిగా మారారు. శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి రచనల స్ఫూర్తితో సాహిత్య కళల సమాహారంగా పలు నాటకాలు రాశారు. ఆయన నాటకాలన్నీ సామాజిక ఇతివృత్తంతోనే ఉండటం విశేషం. 'అసోసియేటెడ్ అమెచ్యూర్ డ్రామా' కాంపెనీని స్థాపించి తన స్నేహితులతో కలిసి నాటకాలను ప్రదర్శించారు. నాటకాలు రాయడంతోపాటు దర్శకత్వం కూడా వహించారు. 'కీర్తిశేషులు' అనే నాటకం వేసి బాగా పాపులర్ అయ్యారు. ఇది ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఓ వైపు నాటకాలతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. సమాజంలో వేళ్లూనుకున్న సమస్యలపై జనంలో చైతన్యం, సమాజంలో మార్పు తెచ్చే కార్యక్రమాలెన్నో చేపట్టారు. క్లాసికల్ మ్యూజిషియన్, హరికథ గాయని కమల కుమారితో పరిచయం ఏర్పడింది. ఇద్దకి అభిరుచులు కలవడం, ఇరు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించటంతో రావుగోపాలరావుకి, కమలా కుమారికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. తనయుడు రావు రమేష్ తండ్రికి తగ్గ తనయుడిగా పరిశ్రమలో అగ్రనటుడిగా రాణిస్తున్నారు.పెళ్ళి తర్వాత సినిమా ఛాన్స్‌ల కోసం మద్రాసు వెళ్ళారు. మొదట 'భక్త పోతన' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తర్వాత 'జగత్ కిలాడీ' చిత్రంతో పూర్తి స్థాయి నటుడిగా మారారు. వైవిధ్యమైన ఆయన వాయిస్ కల్చర్ సినిమా డబ్బింగ్‌కి సెట్ కాదని పలువురు దర్శక, నిర్మాతలు వేరే వారితో డబ్బింగ్ చెప్పించారట. తర్వాత బాపు దర్శకత్వంలో రూపొందిన 'ముత్యాల ముగ్గు' చిత్రంలో కొంపలు ముంచే కాంట్రాక్టర్ పాత్రలో విలన్‌గా కనిపించి తన మార్కు విలనిజాన్ని చూపించారు. ఆయన డైలాగ్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీని పక్కాగా తెరపై ఆవిష్కరింప చేయడంలో బాపు కృషి ప్రశంసనీయం. 'ఎప్పుడూ యదవ బిగినెస్సేనా.. మడిసన్నాక కుసంత కలా పోసనుండాల.. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది?', 'సెగట్రీ సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ? ఆకాసంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదూ' అంటూ రావుగోపాల్ రావు చెప్పిన డైలాగులు బాగా పేలాయి. దీంతో రావుగోపాల్రావు కంచు కంఠానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తెరపై ఆయన వాయిస్ వినిపించిందంటే ప్రేక్షకులు థియేటర్లో ఊగిపోయేవారంటే అతిశయోక్తి లేదు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడీయన్‌గా.. నెగటివ్, పాజిటివ్ ఇలా అన్ని రకాల పాత్రలను పోషించి నటవిరాట్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచారు. నటనలో ఒక ట్రెండ్ సెట్ చేసి 'లారీ డ్రైవర్', 'భార్గవ రాముడు', 'వింత దొంగలు' వంటి తదితర చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా ప్రేక్షకాదరణ పొందారు.రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వ కాలంలో 1984 నుంచి 85 వరకు ఎంఎల్సీగా పనిచేశారు. 1986 నుంచి 92 వరకు రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగానూ ఆంధ్రాయూనివర్సిటీ 'కళా ప్రపూర్ణ' డాక్టరేట్‌తో, కల్చరల్ ఆర్గనైజేషన్ 'నటవిరాట్' బిరుదుతో సముచితంగా సత్కరించాయి. అలాగే 1987లో 'చిత్తురు వి.నాగయ్య అవార్డు' అందుకున్నారు. నట విశ్వరూపానికి ప్రతీకలు.. 'భక్త కన్నప్ప', 'మనవూరి పాండవులు', 'సర్దార్ పాపారాయుడు', 'ఖైదీ', 'ఊరికి మొనగాడు', 'త్యాగయ్య', 'ఛాలెంజ్', 'బొబ్బిలి బ్రహ్మన్న', 'గ్యాంగ్ లీడర్', 'మగధీరుడు', 'కొండవీటి రాజా', 'కిరాయి రౌడీలు', 'కటకటాల రుద్రయ్య', 'జస్టిస్ చౌదరి', 'గోపాలరావుగారి అమ్మాయి', 'ఘరానా మొగుడు', 'దేవాలయం', 'చండశాసనుడు', 'బొబ్బిలి పులి', 'అనుగహ్రం', 'అల్లరి ప్రియుడు', 'అభిలాష', 'యమగోల' ఇలా.. పౌరాణికాలు, జానపద, చారిత్రక, సోషల్ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. 'వేటగాడు' చిత్రంలో యాసతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్‌తో జనం హృదయాలను కొల్లగొట్టారు. 'మావూళ్లో మహాశివుడు', 'స్టేషన్ మాస్టర్', 'వింత దొంగలు', 'రావుగోపాలరావు', 'మనవూరి పాండవులు', 'ఈనాడు' చిత్రాల్లో కమెడీయన్‌గా, విలన్‌గా తన నట విశ్వరూపం చూపించారు. మూడు దశాబ్దాల్లో 300 సినిమాలకి పైగా నటించి ప్రేక్షకుల జేజేలతో లెజెండరీ నటుడిగా తెలుగు చిత్ర చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







