FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- July 18, 2026
హైదరాబాద్: రాష్ట్రంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు ఫిక్కీ మహిళా విభాగం (FICCI FLO) ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం శిల్పారామం సమీపంలో వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.
FICCI FLO (హైదరాబాద్) ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 2027లో FICCI శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలను ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. హైటెక్ సిటీ, సీఐఐ కార్యాలయాల మధ్య FICCI FLO ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతం వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలకు ప్రత్యేక కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో కూడా FICCI భాగస్వామ్యం కావాలని కోరిన ముఖ్యమంత్రి, FICCI ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఫార్చూన్–500 కంపెనీలను భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందులో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
FICCI మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో, మహిళల కోసం మరో ప్రత్యేక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని సీఎం తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే దేశ ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆయన అన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి, వారి సమస్యలు, అవసరాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అలాగే వ్యాపార రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాలను FICCI ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అవార్డులతో సత్కరించాలని సూచించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు, FICCI FLO జాతీయ అధ్యక్షురాలు పూజా గార్గ్, FICCI FLO హైదరాబాద్ చైర్‌పర్సన్ సీతా రెడ్డి గడ్డం, పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







