‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- July 20, 2026
దుబాయ్ వేదికగా అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ బ్రాండ్ ‘రాజు ఆమ్లెట్’ (Raju Omlet) స్థాపకుడు, భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజీవ్ మెహెరిష్ జులై 19న తుదిశ్వాస విడిచారు. కేవలం సాధారణ కోడిగుడ్డు (Egg) ఆధారంగా సరికొత్త రుచులను పరిచయం చేస్తూ, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరంలో ఒక అద్భుతమైన ఫుడ్ సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆయన విజయప్రస్థానం నేటి తరం ఎందరో యువ పారిశ్రామికవేత్తలకు గొప్ప స్ఫూర్తిని అందిస్తుంది.
జర్నలిజం సేల్స్ నుండి బిజినెస్ వైపు అడుగులు
ముంబై విశ్వవిద్యాలయం నుండి కామర్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాజీవ్, మంచి భవిష్యత్తును వెతుక్కుంటూ 1980వ దశకంలో దుబాయ్‌లో అడుగుపెట్టారు. ప్రారంభంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన, ఆ తర్వాత ప్రఖ్యాత ‘ఖలీజ్ టైమ్స్’ పత్రికలో అడ్వర్టైజింగ్ విభాగంలో సేవలందించారు. ఒకసారి గుజరాత్‌లోని వడోదర పర్యటనలో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న ఆమ్లెట్ బండిని చూసిన ఆయనకు ఒక సరికొత్త వ్యాపార ఆలోచన వచ్చింది. ఆ స్ట్రీట్ ఫుడ్ కాన్సెప్ట్‌ను దుబాయ్‌లో ఎందుకు ప్రయత్నించకూడదనే ఆలోచనతో, తన కుమారుడు నకుల్ మెహెరిష్తో కలిసి కరామా ప్రాంతంలో కేవలం 18 సీట్ల సామర్థ్యంతో ఒక చిన్న అవుట్‌లెట్‌ను ప్రారంభించారు.
రాజకుటుంబీకులను సైతం మెప్పించిన రుచులు
ప్రారంభంలో కొన్ని పరిమితమైన వెరైటీలతో మొదలైన ‘రాజు ఆమ్లెట్’ ప్రయాణం, ఆ తర్వాత కాలంలో ఎగ్ భుర్జీ, ఆమ్లెట్లు, ఎగ్స్ కేజ్రీవాల్ వంటి పదుల సంఖ్యలో వెరైటీ ఎగ్ డిష్‌లతో కస్టమర్లను కట్టిపడేసింది. భారతీయ స్ట్రీట్ స్టైల్ ఇంటీరియర్ థీమ్, రుచికరమైన వంటకాలు మరియు అందరికీ అందుబాటులో ఉండే ధరలు ఈ రెస్టారెంట్‌ను కొద్దిరోజుల్లోనే విపరీతమైన పాపులారిటీకి చేర్చాయి. సామాన్య ప్రజలు, పర్యాటకులతో పాటు దుబాయ్ రాజకుటుంబానికి చెందిన ప్రముఖులు కూడా ఈ హోటల్ రుచులకు ఫిదా కావడం విశేషం.
హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో కేస్ స్టడీ
కేవలం ఒకే ఒక్క ప్రధాన పదార్థాన్ని (కోడిగుడ్డు) నమ్ముకుని, అంతర్జాతీయ స్థాయిలో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్‌ను ఎలా నిర్మించవచ్చో నిరూపించినందుకు గానూ ‘రాజు ఆమ్లెట్’ ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాత ‘హార్వర్డ్ బిజినెస్ రివ్యూ’ (Harvard Business Review)లో ఒక ప్రత్యేక కేస్ స్టడీగా చోటు దక్కించుకుంది.
సృజనాత్మకత, పట్టుదల ఉంటే చిన్న ఆలోచనతోనూ గ్లోబల్ బ్రాండ్‌ను సృష్టించవచ్చని నిరూపించిన రాజీవ్ మెహెరిష్ భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆయన సాధించిన విజయం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







